ఉద్యోగులు రోజుకు 14 గంటలు పనిచేయాలని, వారానికి 70 గంటల వర్క్ విధానం ఉండాలని చెప్పిన ఇన్ఫోసిస్(Infosys) సహ వ్యవస్థాపకుడు(Co-Founder) ఎన్.ఆర్.నారాయణమూర్తి.. మరోసారి తన మాటల్ని సమర్థించుకున్నారు. దేశ పురోగతికి ఇది చాలా కీలకమని స్పష్టం చేశారు. CNBC గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్ కు హాజరైన ఆయన.. ఐదు రోజుల పని విధానానికి వ్యతిరేకమని మరోసారి గుర్తు చేశారు. ఈ దేశంలో మనం కష్టపడి పనిచేయాలి, శ్రమకు ప్రత్యామ్నాయం లేదు.. మీరు చాలా తెలివైన వ్యక్తి అయినప్పటికీ కష్టపడి పనిచేయాలని హితవు పలికారు.
‘నన్ను క్షమించండి.. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు.. దీన్ని నాతోపాటు నా సమాధి వద్దకు తీసుకెళ్తా.. ఆరు రోజుల పనిని 1986లో భారతదేశం ఐదు రోజులకు కుదించడం పట్ల తీవ్రంగా నిరాశ చెందా.. దేశ అభివృద్ధికి త్యాగం అవసరం, విశ్రాంతి కాదు.. ప్రధాని మోదీ 100 గంటలు పనిచేస్తున్నారు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఏం చేశాయో ఆలోచించాలి.. జాతీయ పునర్నిర్మాణ మార్గాలు ఆలోచించాలి.. ఉదయం ఆరున్నరకు బయల్దేరి రాత్రి 8:40 వరకు పనిచేశా.. ఇప్పుడు దాని గురించి గర్వపడుతున్నా..’ అని నిర్మొహమాటంగా చెప్పారు.