‘ఇన్ స్టాగ్రామ్’లో అసభ్యకర మెసేజ్ లతో విసిగిపోతున్నారా.. మీకు తెలియకుండానే న్యూడ్ ఫొటోలు పెట్టి లైంగికంగా వేధిస్తున్నారా.. వీడియోలు షేర్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారా… అయితే ఇలాంటి వాటికి ఇక చెక్ పడబోతున్నది. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఇక న్యూడ్ కంటెంటే కనపడకుండా మెటా ఆధ్వర్యంలో ఇన్ స్టాగ్రామ్(Instagram)… కొత్త ఫీచర్ ను తెస్తున్నది. తమ యూజర్లకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నది.
‘ఇన్ స్టా’ రీల్స్ పాపులర్…
‘ఇన్ స్టా’లో పోస్ట్ చేసే రీల్స్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఫొటోలు, వీడియోలకు పెద్దయెత్తున స్పందన వస్తుంటుంది. అయితే ఇవే కొన్నిసార్లు ప్రమాదకరంగా మార్చుతుంటాయి. అసభ్యకర మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను వేధిస్తుంటారు కొందరు. అయితే రానున్న రోజుల్లో(Future) ఇలాంటి అసభ్యకర కంటెంట్(Sexual Content)ను అరికట్టేందుకు సరికొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది.
బ్లాక్ మెయిలింగ్…
మెయిన్ గా యువత(Youth)ను దృష్టిలో ఉంచుకుని వారిని ఈ అసభ్యకర కంటెంట్ నుంచి కాపాడేందుకు సరికొత్త ఫీచర్ ను తెస్తున్నట్లు ‘ఇన్ స్టా’ ప్రకటించింది. లైంగిక, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను ఆన్ లైన్(Online)లోని వ్యక్తిగత ఖాతాల్లోకి పంపడం ద్వారా వ్యక్తులను బలవంతం చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయటం, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం వంటి వాటిని గుర్తించేలా ఈ సాఫ్ట్ వేర్ తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఈ టూల్ ను జనవరిలోనే ప్రయోగాత్మకంగా పరిశీలించింది సంస్థ. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా న్యూడ్ ఫొటోలు డిటెక్ట్ చేసి వాటిని వెంటనే బ్లర్ చేసింది.
ఆటోమేటిక్ గా…
‘న్యూడిటి ప్రొటెక్షన్(Nudity Protection)’ పేరిట తీసుకొస్తున్న ఈ సాఫ్ట్ వేర్.. ఆటోమేటిక్(Automatic)గా అలాంటి మెసేజ్ లను గుర్తిస్తుంది. వెంటనే అసభ్యకర ఫొటోలు, వీడియోలను మాసిపోయేలా(Blur) చేస్తుంది. ప్రత్యక్ష సందేశాల(Direct Messages) ద్వారా తరచుగా వచ్చే వ్యక్తిగత చిత్రాల(Personel Images)ను గుర్తించి ఆ కంటెంట్ ను బ్లర్ చేసి ఎదుటివారికి కనపడకుండా చేయడం ‘న్యూడిటి ప్రొటెక్షన్ టూల్’ బాధ్యత అని ‘ఇన్ స్టాగ్రామ్’ ప్రకటించింది. 18 ఏళ్ల వయసు పైబడ్డ వారు(Adults) అసభ్యకర కంటెంట్ వల్ల లైంగిక వేధింపులకు గురికాకుండా ఈ టూల్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలా ఫీచర్ రూపొందించింది.