కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి కొరత(Water Crisis) ఏర్పడ్డ వేళ అక్కడి ప్రజల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ప్రజలే ఇలా అవస్థలు పడుతుంటే ఇక కంపెనీల(Industries) వ్యవహారం ఎలా ఉంటుంది. అసలే బెంగళూరులో భారీయెత్తున IT కంపెనీలుండగా.. వాటన్నింటికీ నీటి సరఫరా చేయడం కష్టసాధ్యమైన పనే. ఇలాంటి వాతావరణంలో కేరళకు చెందిన మంత్రి నీటి కొరతపై మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రోజుకు 500 మిలియన్ లీటర్ల కొరత బెంగళూరును వేధిస్తున్నది.
మాకు ఆ ఇబ్బంది లేదు…
మా రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదంటూ కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎవరైనా కేరళకు రావొచ్చంటూ ఆహ్వానం పలికారు. ‘కేరళలో చిన్నవి, పెద్దవి కలిపి 44 నదులున్నాయి.. బెంగళూరులో వాటర్ సప్లయ్ అనేది క్లిష్టంగా తయారైంది.. బెంగళూరు వదిలిపెట్టాలనుకున్న కంపెనీలకు ఇండియాలోనే ‘ద బెస్ట్ కేరళ’.. ఇప్పటికే కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్ IT కారిడార్స్ ఉన్నాయి.. మరిన్ని కంపెనీలు వస్తే వాటిని బాగా డెవలప్ చేస్తాం.. మా రాష్ట్రంలో ఎయిర్ పోర్టులు, రోడ్లు, రైల్వే, పోర్టులు బ్రహ్మాండంగా అందుబాటులో ఉంటాయి.. వీటితోపాటు అందరినీ ఆకట్టుకునే(Attract) లొకేషన్స్(Locations) ఉన్నాయి..’ అని అన్నారు.
ఎవరినీ ఉద్దేశించి…
అయితే రాజీవి.. ఏ కంపెనీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. సిలికాన్ వ్యాలీ తరహాలో కేరళలో IT హబ్ ను తయారు చేయాలన్నదే తమ టార్గెట్ అని, టెక్ ఇండస్ట్రీలో మలయాళీ గ్రాడ్యుయేట్లు పెద్దసంఖ్యలో ఉండటం కూడా ఇందుకు అనుకూలమని గుర్తు చేశారు. 2.5 లక్షల నుంచి ఈ ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగులకు పెంచడమే లక్ష్యంగా ఆ రాష్ట్రం ముందుకు సాగుతున్నది. ఇండియన్ IT ల్యాండ్ స్కేప్ లో కేరళది రానున్న రోజుల్లో ప్రధాన పాత్ర అని ఆ రాష్ట్ర భావిస్తున్నది.