మాటల్లోనే కాదు చేతల్లోనూ సాహసాల్ని ప్రదర్శించే ప్రధాని మోదీ.. మరో సాహసయాత్ర చేపట్టారు. సముద్ర గర్భంలో కొలువైన శ్రీకృష్ణుని మందిరాన్ని చేరుకుని పూజలు చేశారు. గుజరాత్ లోని పంచకుయి బీచ్ కు చేరుకున్న ప్రధాని.. ఆరాధనతో కూడిన తెల్లటి హెల్మెట్ ధరించి నీటిలోనే నెమలి పింఛంతో పూజలు నిర్వహించారు. ఓఖా ప్రధాన భూభాగం నుంచి బేట్ ద్వారక ద్వీపం(Island)ను కలుపుతూ నిర్మించిన ‘సుదర్శన్ సేతు’బ్రిడ్జిని ప్రారంభించిన కొద్దిసేపటికే.. ఆయన సముద్ర గర్భంలోకి వెళ్లి వచ్చారు.
స్కూబా డైవింగ్..
ద్వారక వద్ద అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేసి ప్రధాని ఆశ్చర్యపరిచారు. కడలిలో మునిగిన ద్వారక నగరాన్ని దర్శించుకున్న(Visit) మోదీ.. అక్కడే పూజలు చేశారు. నావికా దళాధికారుల సాయంతో కడలి గర్భంలోకి చేరుకుని నెమలి పింఛం(Peacock Feathers)తో పూజలు చేసిన ప్రధాని… తన్మయత్వానికి గురైనట్లు ‘X’ ద్వారా తెలిపారు. ‘సముద్రంలో పూజ చేయడం దివ్యమైన అనుభూతి(Feeling)నిచ్చింది.. నీటిలో ఉన్న ద్వారక ప్రాంతంలో పూజ చేయడం గొప్ప అదృష్టం.. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తాడు’.. అంటూ మోదీ సంతోషం పంచుకున్నారు.
పురాతన ద్వారక అదే…
పురాతన కాలంలో ద్వారకా నగరం సముద్రంలోకి చేరుకుంది. కడలిలో కొలువైన శ్రీకృష్ణుణ్ని కొలిచేందుకు భక్తులు… ప్రస్తుతం పురాతత్వ శాఖ అధికారుల సహకారంతో నీటి లోపల స్వామి వారిని దర్శించుకుంటారు. తాను కూడా అందరిలాగే సాగర గర్భంలోకి వెళ్లేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నానని మోదీ తెలిపారు. విశ్వకర్మ సృష్టికి ఆనాటి ద్వారకా నగరం ఒక నిదర్శనమని మోదీ కొనియాడారు.