Ola S1X 4kWh electric scooter variant launch : ఓలా కొత్త S1X ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరకే ఈ కొత్త స్కూటర్ ను అందిస్తున్నది. కొత్త Ola S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 190 కిలోమీటర్ల పరిధి వరకు అందిస్తుంది. ఇందులోని 4kWh బ్యాటరీ ప్యాక్ ఇ-స్కూటర్ల S1X లైనప్‌లో అతిపెద్దదిగా చెప్పవచ్చు. అందుకే ఈ ఈవీ స్కూటర్ ధర రూ.1.10 లక్షలు ఉంటుంది. ఓలా S1X (3kWh) వేరియంట్ కన్నా దాదాపు రూ.20,000 ఖరీదైనదిగా ఉంది. ఎంట్రీ-లెవల్ Ola S1 X 2 kWh ట్రిమ్ ధర రూ.79,999 వద్ద అలాగే ఉంది. అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమేనని గమనించాలి.
గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ :
Ola S1X స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం (4kWh) S1X (3kWh) వేరియంట్ మాదిరిగా అదే మెకానికల్లను కొనసాగిస్తోంది. గంటకు 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది. అయితే, గరిష్ఠ వేగం గంటకు 90కిలోమీటర్లుగా ఉండనుంది. ఎలక్ట్రిక్ మోటార్ 6kW (8bhp) ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది.
ఓలా ఎలక్ట్రిక్ కొత్త 4kWh S1X స్కూటర్‌కు సంబంధించి కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. హై రేంజ్, తక్కువ ధరను కోరుకునే వినియోగదారుల కోసం ఓలా S1 ప్రో రేంజ్ మాదిరిగానే ఓలా S1X వేరియంట్ ధర కూడా ఉంటుందని ఆయన అంటున్నారు.
హై-రేంజ్ వేరియంట్ బుకింగ్స్ ఓపెన్.. ఏప్రిల్‌లో డెలివరీలు :
ఓలా S1X ఈవీ స్కూటర్ 2kWh, 3kWh బ్యాటరీ వేరియంట్ డెలివరీలు ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమవుతాయని ఓలా ధృవీకరించింది. ఈ కొత్త S1X (4kWh) వేరియంట్ డెలివరీలు కూడా ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. అయితే, ఇప్పుడు హై-రేంజ్ వేరియంట్ కోసం బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను ప్రస్తుత 400 నుంచి 600 అవుట్లెట్లకు విస్తరించే ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, ఏప్రిల్ నాటికి 10వేల ఫాస్ట్ ఛార్జర్లను అందించాలని ఓలా యోచిస్తోంది.
ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ :
చివరగా, ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌పై 8 సంవత్సరాల/80వేల కిలోమీటర్ల వారంటీని ప్రారంభించింది. తయారీదారు అదనంగా రూ.5వేలకు లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తోంది. అయితే, 1.25 లక్షల కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ధర రూ.12,500కి అందుబాటులో ఉంది.