ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. బ్యాటింగ్ లోనూ సత్తా చాటుతున్నది. తొలి రోజు(First Day) ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోరు చూపించడంతో ప్రత్యర్థిపై స్పష్టమైన లీడ్ దిశగా సాగుతోంది. అంతకుముందు స్పిన్నర్లు విజృంభించి వికెట్లు తీయడంతో ఇంగ్లిష్ జట్టును 218 స్కోరుకే కట్టడి చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఇంగ్లండ్ బజ్ బాల్ ఆటను గుర్తుకు తెచ్చింది.
ఓపెనర్లు అదరహో…
ఈ సిరీస్ లో అత్యధిక పరుగుల(Highest Scorer) వీరుడిగా నిలిచిన యశస్వి జైస్వాల్(57; 58 బంతుల్లో 5×4, 3×6).. ఈ ఇన్నింగ్స్ లోనూ అదే దూకుడు చూపించాడు. ముఖ్యంగా షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో కొట్టిన మూడు సిక్స్ లు హైలెట్ గా నిలిచాయి. మరో ఎండ్ లో రోహిత్(52 నాటౌట్; 83 బంతుల్లో 6×4, 2×6) సైతం దంచికొట్టాడు. ఇంగ్లిష్ ఆటగాళ్ల ఎటాకింగ్ గేమ్ అయిన ‘బజ్ బాల్’ను వాళ్లపైనే ఆడి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. కానీ బషీర్ బౌలింగ్ లోనే వికెట్ల ముందుకు వచ్చి స్టంపౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ కు జతగా శుభ్ మన్ గిల్(26 నాటౌట్; 39 బంతుల్లో 2×4, 2×6) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లిష్ జట్టు స్కోరును చేరుకోవాలంటే టీమ్ఇండియా ఇంకో 83 పరుగులు చేస్తే చాలు.
రికార్డులివే…
5 వికెట్ల హాల్ ను అందుకున్న కుల్దీప్.. టెస్టుల్లో ఆ మార్క్ ను నాలుగు సార్లు చేరుకున్నాడు. జైస్వాల్ కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ అయితే, 16 ఇన్నింగ్స్ ల్లోనే 1,000 రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 18వ హాఫ్ సెంచరీతో కెప్టెన్ గా టెస్టుల్లో 1,000 పరుగులు దాటాడు. రవిచంద్రన్ అశ్విన్ తోపాటు తానూ వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో 6 వేల పరుగుల(6,003) మార్క్ ను అధిగమించాడు.