దేశ ఎలక్ట్రానిక్స్ రంగం(Sector)లో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న సెమీకండక్టర్ ఇండస్ట్రీకి అడుగు పడింది. అస్సాంలో రూ.27,000 కోట్లతో నిర్మించనున్న టాటా ప్లాంటుకు భూమి పూజ జరిగింది. 27 వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో 2025 కల్లా మొదలయ్యే ప్లాంటుకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భూమి పూజ చేశారు.
15,000 ఉద్యోగాలు నేరుగా మరో 12,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా మారిగావ్ జిల్లాలోని జాగిరోడ్ వద్ద నిర్మిస్తున్న టాటా సెమీకండక్టర్ ప్లాంటు వద్ద జరిగిన కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు.
ఈ ప్లాంటులో మూడు రకాల వ్యవస్థలు వైర్ బాండ్, ఫ్లిప్ చిప్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్యాకేజింగ్(ISP) ఉంటాయి. ఈ చిప్ ల అభివృద్ధి వల్ల ఎలక్ట్రిక్ వెహికిల్స్(EV)ల వ్యవస్థలో భారీ మార్పులు రానున్నాయి. ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి కీలకంగా నిలిచే చిప్ వ్యవస్థ మన వద్ద అందుబాటులోకి వస్తే ఈ రంగంలో భారత్ సరికొత్త మైలురాయి దిశగా సాగుతుంది.