ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు(Industries), టెలికాం, రక్షణ(Defence), డిస్ ప్లే, ఎలక్ట్రానిక్స్ రంగాలన్నీ ‘చిప్(Chip)’ల వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయి. కారు కదలాలన్నా, బస్సు నడవాలన్నా అంతా ఈ చిప్ ల మహిమే. అలాంటి ‘చిప్’ల కోసం విదేశాలపై ఆధాపడుతూ ఏటా లక్షల కోట్ల ధనాన్ని వాళ్లకు అప్పగిస్తున్నాం. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ లో ఒక జిల్లా అంత కూడా ఉండని తైవాన్… ‘చిప్’ల ప్రొడక్షన్ లో ప్రపంచాన్నే శాసిస్తోంది. అలా మనం ఎందుకు కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘సెమీకండక్టర్’ రంగంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా తాజాగా కేంద్ర కేబినెట్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మూడు సెమీ కండక్టర్ల(Semi Conductors) పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారతీయ ప్రఖ్యాత కంపెనీ ‘టాటా’కు బాధ్యతలు కట్టబెట్టింది.
ఎక్కడెక్కడంటే…
గుజరాత్ లోని ధొలేరా(Dholera), సనంద్(Sanand)ల్లో రెండు.. అసోంలోని మారిగావ్(Morigaon)లో ఒకటి.. మొత్తం మూడు సెమీకండక్టర్ యూనిట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మూడు చోట్లా 100 రోజుల్లోనే పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2021 డిసెంబరు 21న తీసుకున్న ‘పర్యావరణ హిత సెమీకండక్టర్ల ఉత్పత్తి’ నిర్ణయంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం రూ.76,000 కోట్లు వెచ్చిస్తుండగా, తొలిసారి ఈశాన్య రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు రాబోతున్నది. అసోం మారిగావ్ యూనిట్ కోసం రూ.27,000 కోట్లు ఖర్చు చేస్తుండగా.. ‘టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్(TSAT)’ ఆధ్వర్యంలో యూనిట్ నడిపిస్తారు.
టాటా, తైవాన్ కంపెనీతో…
‘టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్(TEPL)’ ఆధ్వర్యంలో తైవాన్ కు చెందిన ‘పవర్ చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్(PSMC)’తో కలిసి జాయింట్ గా ఈ 3 యూనిట్లను నెలకొల్పుతారు. హై పర్ఫార్మెన్స్ తో కూడిన 28nm టెక్నాలజీకి చెందిన అత్యంత సూక్ష్మమైన చిప్ లను నెలకు 50,000 ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ‘సీజీ పవర్’, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్’, జపాన్ కు చెందిన ‘స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్’తోపాటు తైవాన్ కంపెనీల జాయింట్ వెంచర్ తో సనంద్ యూనిట్ రూ.7,600 కోట్లతో నడుపుతారు. తైవాన్ లో ఇప్పటికే ‘టాటా’కు 6 కంపెనీలు ఉండగా.. వాటి నుంచి ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు.
మూడేళ్లలోనే ప్రగతి…
చిప్ ల ఇండస్ట్రీకి ప్రభుత్వం సంకల్పించి మూడేళ్లవుతుండగా.. అత్యంత తక్కువ సమయంలోనే సెమీ కండక్టర్ల తయారీ కల రూపుదాల్చనుంది. ఈ యూనిట్ల వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి దక్కనుండగా.. ఫ్యాబ్రికేషన్ రంగంలో దేశ ప్రగతికి ఇది అద్దం పట్టనుంది. కరోనా కాలంలో రెండేళ్లపాటు ‘చిప్’ల దిగుమతులు(Imports) నిలిచిపోయి వాహనాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్కో కారు ధర 30 నుంచి 50 శాతం దాకా పెరగడం చూశాం. ఇప్పుడీ సెమీ కండక్టర్ యూనిట్లు అందుబాటులోకి వస్తే మాత్రం ఇక నుంచి విదేశాల వైపు చూడాల్సిన పని ఉండదు.