బహుళ(Multiple) వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం నాడు భారత్ విజయవంతం(Successful)గా ప్రయోగించింది. శత్రువుకు చెందిన విభిన్న ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసేలా తయారైన అగ్ని-5 వెనుక… ఓ మిసైల్ ‘రాణి’ కీలక పాత్ర పోషించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్(MIRV) పరిజ్ఞానంతో కూడిన మిసైల్ ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDOలోని అడ్వాన్సుడ్ సిస్టమ్ లేబొరేటరీ రూపొందించింది. ఈ టెక్నాలజీ కలిగిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. అయితే ఈ కీలక టెక్నాలజీకి ఒక మహిళ తన మేధస్సును ఉపయోగించారు.
నిజంగా ‘రాణి’యే…
మిసైల్ ఎక్స్ పర్ట్ గా ముద్రపడ్డ షీనా రాణి.. అగ్ని-5 మిసైల్ కు రూపకర్త. ఇదొక్కటే కాదు… గత అగ్ని క్షిపణుల తయారీలోనూ ఈమెదే కీలక పాత్ర. గతంలో కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(ISRO)లో ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన షీనా.. 1998 పోఖ్రాన్ అణు పరీక్షల(Nuclear Tests) తర్వాత 1999లో DRDOలో చేరారు. తిరువనంతపురంలో జన్మించిన ఈమె.. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. షీనా టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కన్నుమూశారు. అగ్ని-5కు శాంకరి చంద్రశేఖరన్ ప్రాజెక్టు డైరెక్టర్ అయినా ప్రోగ్రాం డైరెక్టర్ గా మాత్రం షీనానే ఉన్నారు.
మాతృమూర్తే ఆదర్శంగా…
తల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూనే షీనా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం(CET) నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అగ్ని మిసైల్స్ కు సంబంధించి వివిధ సబ్ యూనిట్లలో కొన్నేళ్లపాటు ఆమె పనిచేశారు. ఆయా అగ్ని క్షిపుణుల లాంఛింగ్ కు ముందు వాటి హెల్త్ కండిషనింగ్ బాధ్యత మొత్తాన్ని షీనానే చూసేవారు. తాజా MIRV టెక్నాలజీ రూపకల్పనలోనూ ఈమెదే ప్రధాన పాత్ర. ఈ టెక్నాలజీ కోసం ఆమె.. తన జీవితానికి ఇదే అతి పెద్ద లక్ష్యం అన్నట్లుగా పనిచేశారు.
‘మిసైల్ మ్యాన్’ ఆదర్శంగా…
ఈమె భర్త పి.ఎస్.ఆర్.ఎస్.శాస్త్రి సైతం DRDOలోనే సేవలందిస్తున్నారు. ఇలా ఈ దంపతులిద్దరూ దేశ సేవలోనే నిమగ్నమయ్యారు. ‘మిసైల్ మ్యాన్’, భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఆదర్శమని షీనా చెబుతుంటారు. మిసైల్ టెక్నాలజిస్ట్ అయిన డా.అవినాశ్ చందర్.. షీనా ప్రతిభను తొలినాళ్లలోనే గుర్తించి ఆమె ఎదుగుదలకు కారణమయ్యారు. ఆమె ప్రతిభకు ఇప్పటివరకు ఎన్నో పురస్కారా(Awards)లు సొంతమయ్యాయి. 2016లో షీనా రాణి ‘సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు.