
వారానికి 90 గంటల పని(Work Hours) ఉండాలంటూ వివాదాస్పదంగా మాట్లాడిన లార్సన్&టూబ్రో(L&T) ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. సంక్షేమ పథకాల వల్ల పనిచేసేవారు దొరకడం లేదన్నారు. చెన్నైలో జరిగిన CII సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ, జన్ ధన్ వంటి నగదు బదిలీ స్కీంల వల్ల నిధులు నేరుగా వస్తున్నాయని, అందుకే సొంతూళ్లు వదిలిపెట్టేందుకు ప్రజలు ఇష్టపడట్లేదన్నారు. ఇంకా ఏమన్నారంటే…
‘డైరెక్ట్ బెనిఫిట్స్ స్కీంలతో ప్రజల ఆర్థిక స్థితి బాగానే ఉంది.. అవకాశాల కోసం వెంపర్లాడే పరిస్థితి రావడం లేదు.. ఉన్న ఊర్నుంచి కదలకపోవడానికి ఇలాంటి స్కీమ్సే కారణం కావచ్చు.. కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం చూపుతుంది.. వలసల విషయంలో దేశం విచిత్రమైన స్థితి ఎదుర్కొంటోంది.. ఎల్&టీకి 4 లక్షల మంది కార్మికులు కావాలి.. కానీ ఎప్పుడెలా ఉంటుందోనన్న భయంతో 16 లక్షల మందిని తీసుకుంటున్నాం..’ అంటూ ప్రసంగించారు. వారానికి 90 గంటలు పనిచేయాలన్న సుబ్రమణ్యన్.. ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తావ్.. ఎంతసేపూ నీ భార్యవైపు చూస్తూ ఉండిపోతావ్.. రా, ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించు..’ అంటూ కొద్దిరోజుల క్రితం మాట్లాడటంతో విమర్శలు వచ్చాయి. చివరకు పని గంటలను పెంచే ఆలోచనేదీ లేదని కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది.