కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన రెండ్రోజుల పర్యటన కోసం చెన్నైలో అడుగుపెట్టగానే కరెంటు కోతలు ఎదురయ్యాయి. విమానాశ్రయంలో దిగే సమయానికి ఆ పరిసరాల్లో అంధకారం అలుముకుంది. ఈ అంశం భాజపా, డీఎంకే మధ్య వివాదం రాజేసింది. హోంమంత్రి పర్యటన సమయంలో విద్యుత్తు లేకపోవడం భద్రతాలోపమేనని, దీనిపై విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతిగా స్పందించిన డీఎంకే.. భాజపా రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. కరెంటు కోత ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఎండలు ఎక్కువగా ఉండటం వల్లే విద్యుత్తు వినియోగం పెరిగి సమస్య తలెత్తిందని అంటోంది. ఎయిర్ పోర్ట్ తోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి తొమ్మిదిన్నర నుంచి 45 నిమిషాల పాటు చీకట్లు అలుముకున్నాయి. చివరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్తును పునరుద్ధరించగలిగారు.