అరేబియా సముద్రంలో ఏర్పడిన “బిపర్ జాయ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను కచ్(గుజరాత్), కరాచీ(పాకిస్థాన్) మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం తూర్పు అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను.. ఈ నెల 15న తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 150 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. గుజరాత్ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల తుపాను తీరం దాటే వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.