గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్… లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్… ముంబయి-అహ్మదాబాద్ కారిడార్ లో ప్రయోగం… సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల టన్నెల్… ఇవీ… దేశంలో తొలి బుల్లెట్ రైలు విశేషాలు. మోదీ మూడోసారి అధికారంలోకి(3.0) వచ్చాక బుల్లెట్ ట్రైన్(Bullet Train)ను చూడబోతున్నారంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘X’లో వీడియోను షేర్ చేశారు. కలలు కాదు.. వాస్తవాలను తమ ప్రభుత్వం సృష్టిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ రైలు కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో పాలనలో ఎదురుచూడాలంటూ పోస్ట్ చేశారు.
అద్భుతాల దిశగా…
భూకంపాల(Earth Quakes)ను ముందే పసిగట్టేలా అధునాతన(Modern) వ్యవస్థ, స్టీల్ వంతెన(Bridges)లు, ఏడు సొరంగాలు, సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల మేర పొడవైన టన్నెల్(Tunnel), అత్యాధునికమైన రైల్వే స్టేషన్లకు సంబంధించిన వివరాల్ని మంత్రి వీడియోలో వివరించారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు సాకారం కోసం రూ.1.08 లక్షల కోట్లు అవసరమవుతాయని, 2026లో ఈ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయోగాత్మకంగా దీన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబయికి నడపనున్నారు. ఈ సౌకర్యం వల్ల ప్రయాణికులు 3 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు.
508 కిలోమీటర్లకు పైగా…
ఈ బుల్లెట్ రైలు ప్రయాణ దూరం 508.17 కిలోమీటర్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణ పనులు ఊపందుకున్నాయని, మరో రెండేళ్లలో సాకారమయ్యే కల కోసం పెద్దయెత్తున పనులు జోరందుకున్నాయని తెలిపారు. 251 కిలోమీటర్ల మేర పిల్లర్లతో వివిధ రకాల నిర్మాణాలు నడుస్తున్నాయన్నారు. సముద్రగర్భంలో వేసిన సొరంగాలు అత్యద్భుతంగా ఉండబోతున్నాయని ‘X’లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.