ఉదయం పదిన్నర… CJI సంజీవ్ ఖన్నా బెంచ్ కు కేసులు వస్తూనే ఉన్నాయి. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కేసు అప్పుడే వచ్చింది. దాన్ని వాదించే లాయర్ ఎంటరవుతుండగా హాలంతా ‘అటెన్షన్’. అతడే అభినవ్ చంద్రచూడ్. భారత న్యాయ వ్యవస్థలో ఈ కుటుంబానిది ఎనలేని పాత్ర. జస్టిస్ వై.వి.చంద్రచూడ్ మనవడు, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తనయుడే అభినవ్. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ రిటైరవగా ప్రస్తుత CJI సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. తాత, తండ్రి వారసత్వంగా న్యాయవ్యవస్థనే ఎంచుకున్నారీ యువ లాయర్.
తనయులిద్దరినీ…
సుప్రీంకు వచ్చే ముందు 2016 మే వరకు అలహాబాద్ హైకోర్టు CJగా పనిచేశారు జస్టిస్ డి.వై.చంద్రచూడ్. ఆయన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో సుప్రీంలో ఎక్కడా కనపడలేదు అభినవ్. కానీ తండ్రి రిటైరవగానే టాప్ కోర్టులో అడుగుపెట్టారు. రిటైర్మెంట్ స్పీచ్ లోనూ తనయులు అభినవ్, చింతన్ గురించి ప్రస్తావించారు చంద్రచూడ్. వారిని సుప్రీంలో చూడాలని ఉన్నా, వృత్తిపర సమగ్రత దెబ్బతినకూడదంటూ తనయుల ఆఫర్ ని తిరస్కరించారు.
తండ్రి బాటలోనే…
1982-85లో డి.వై.చంద్రచూడ్ హార్వర్డ్ లో చదివారు. ఆయన తండ్రి జస్టిస్ వై.వి.చంద్రచూడ్ CJIగా సుదీర్ఘకాలం సేవలందించారు. తండ్రి పదవీకాలంలో భారత కోర్టుల్లో ప్రాక్టీసు చేయకూడదని భావించారు. అచ్చం అలాగే అభినవ్ సైతం అదే చేశారు. స్టాన్ ఫోర్డ్ స్కూల్లో డాక్టర్ ఆఫ్ సైన్స్ ఆఫ్ లా, మాస్టర్స్ లా పూర్తిచేశారు. అక్కడి ‘లా ఫర్మ్స్’లో ప్రాక్టీస్ చేశారు. తర్వాత ముంబయి లా కాలేజీ నుంచి 2008లో పట్టా అందుకున్నారు. చాలా పుస్తకాలు రాశారు అభినవ్. యూట్యూబ్ షోలో అశ్లీల కామెంట్స్ చేసినందుకు ప్రముఖ ఇన్ ఫ్ల్యూయెన్సర్ రణ్ వీర్ అలహాబదియాపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. అలా ఆ కేసులన్నింటిపై సుప్రీంను ఆశ్రయించాడు అలహాబదియా. ఇప్పుడీ కేసును వాదించబోతున్నారు అభినవ్ చంద్రచూడ్.