
Published 29 Dec 2023
ఉల్ఫా ఉగ్రవాదంతో అట్టుడికిన అసోం(Asom)లో దశాబ్దాల తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడబోతోంది. కేంద్ర ప్రభుత్వ చర్చలతో శాంతియుత మార్గాన్ని అనుసరించబోతున్నట్లు ULFA(United Liberation Front Of Asom) అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అసోం ప్రభుత్వం.. ఉల్ఫా నేతలతో సంధి ఒప్పదం కుదుర్చుకుంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హింసామార్గాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించడం పట్ల రాష్ట్ర పురోభివృద్ధికి కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. అరబింద రాజ్ ఖోవా నేతృత్వంలోని ఉల్ఫాతో గత పన్నేండేళ్లుగా ఆ రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. మోదీ సర్కారు కొలువుదీరిన 2014 తర్వాత ఈ చర్చల్లో పురోగతి ఏర్పడి శాంతియుత వాతావరణం ఏర్పడటానికి మార్గం సుగమమైంది.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయం అసోంకే కాదని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్తుకు ముందడుగు పడ్డట్లేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్ఫాతో ఒప్పందం మేరకు ఒక ప్రత్యేక కమిటీని వేస్తున్నారు. ఇరువర్గాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పర్యవేక్షించేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం-అసోం-ఉల్ఫా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఉగ్రవాద క్యాంపులను ఖాళీ చేసి అందులోని సభ్యులంతా జనజీవన స్రవంతిలో కలుస్తారు.
అరబింద రాజ్ ఖోవా ఆధ్వర్యంలోని ఉల్ఫాలో 553 సభ్యులున్నారు. ఈ చర్చలు 2011 సెప్టెంబరు 3న మొదలయ్యాయి. వేర్పాటు ఉద్యమంతో 1979 ఏప్రిల్ లో ఉల్ఫా ఏర్పాటు కాగా అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని హింసాత్మకంగా మార్చింది. దీంతో ఈ సంస్థపై 1990లో కేంద్రం నిషేధం విధించింది. 2012లో ఉల్ఫా రెండు వర్గాలుగా విడిపోవడంతో.. రాజ్ ఖోవా వర్గం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తే కమాండర్-ఇన్-చీఫ్ పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం వ్యతిరేకించింది. స్థానికుల గుర్తింపు, భూహక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో సంస్కరణలకు రాజ్ ఖోవా వర్గం కోరింది. ఈ డిమాండ్లపై కేంద్రం ముసాయిదా ఒప్పందాన్ని పంపడంతో శాంతి చర్చలకు ముందడుగు పడింది.