అక్కడ 70 శాతం MLAలపై క్రిమినల్ కేసులున్నాయి… ఈ మాట వింటే ఏ ఉత్తర్ ప్రదేశో, లేక బిహారో గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అక్కడ జరిగే నేరాలే(crimes) ఎప్పుడూ వింటుంటాం. కానీ అందుకు భిన్నంగా అత్యధిక అక్షరాస్యత(literacy) కలిగిన కేరళలోనే ఇంతమంది నేర MLAలు ఉన్నారట. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) అనే సంస్థ నివేదిక వెల్లడించింది. ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ప్రముఖ NGO అయిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ స్వయంగా ఈ నివేదికను రూపొందించింది. ‘నేషనల్ ఎలక్షన్ వాచ్ న్యూస్’ తో కలిసి ADR.. జాయింట్ గా రిపోర్ట్ తయారు చేసింది. దేశవ్యాప్తంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే MLAల్లో 44 శాతం మందిపై కేసులుండగా… అందులో 28 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు తెలిపింది.
కేసులు లేనోళ్లకంటే ఉన్నోళ్లకే ఆస్తులెక్కువ
దేశవ్యాప్తంగా MLAల ఆస్తుల్ని లెక్కగడితే యావరేజ్ గా 10 కోట్ల పైగానే ఉందని… క్రిమినల్ కేసులు ఉన్నవారికన్నా లేని వారికే తక్కువ ఆస్తి ఉన్నట్లు ADR నివేదిక తెలియజేసింది. కేసులు ఉన్న MLAల ఆస్తి యావరేజ్ లెక్కేస్తే రూ.13.63 కోట్ల రూపాయలని.. అదే కేసులు లేని వారి ఆస్తి యావరేజ్ గా రూ.11.45 కోట్లని స్పష్టం చేసింది. 28 అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 మంది MLAల్లో 4,001 మంది MLAల అఫిడవిట్ల ఆధారంగా వివరాల్ని తెలియజేసింది. స్వయంగా శాసనసభ్యులే ఈ విషయాల్నిఅఫిడవిట్లలో వెల్లడించారని ఈ జాయింట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 1,136 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని… అందులో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులున్నాయని తెలిపింది.