మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసును CBIకి బదిలీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మహిళలపై ఎలాంటి నేరాలు జరిగినా సహించేది లేదని స్పష్టం చేసింది. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ అఫిడవిట్ ను దాఖలు చేశారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ను అనుకున్న టైమ్ లోపు పూర్తి చేయడానికి విచారణను మణిపూర్ బయటకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కేంద్రం కోరింది. అటు ఈశాన్య రాష్ట్రంలో జాతుల ఘర్షణకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టనుంది.
జులై 20న వెలుగుచూసిన మహిళల నగ్న వీడియోలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చను రేకెత్తించాయి. ప్రజాస్వామ్యం పరువు తీసేస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు సైతం ఈ కేసును సుమోటోగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఈ కేసులో వేగంగా చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగాల్సి ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకు హామీ ఇచ్చిన మేరకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.
వాస్తవానికి మణిపూర్ జాతుల ఘర్షణకు స్థానికతే కారణమా లేక విదేశీ కుట్ర ఉందా అన్నది తేలాల్సి ఉంది. దీన్ని తేల్చాలని భావించినా, అక్కడి పరిణామాలను చూసి కేంద్రం ఒకరకంగా వెనుకడుగు వేసింది. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ తోపాటు సర్వోన్నత న్యాయస్థానం సైతం గట్టిగా నిలదీయడంతో CBI ఇన్వెస్టిగేషన్ కు రంగం సిద్ధం చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల మహిళల అంశంతోపాటు అల్లర్లకు సంబంధించిన పూర్తిస్థాయి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు మహిళల కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.