Published 11 Dec 2023
దేశంలో అంతర్భాగమైన తర్వాత ఏ రాష్ట్రమైనా ఒకటే అని, జమ్ముకశ్మీర్(Jammu Kashmir) సైతం అన్ని రాష్ట్రాలతో సమానమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో రాష్ట్రపతి ప్రకటన, నిర్ణయాలపై జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం.. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం కచ్చితంగా జమ్ముకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి క్లారిటీ ఇచ్చింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా ఎన్నికలు జరపాలని, 2024 సెప్టెంబరు 30లోగా ఎలక్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
యుద్ధ పరిస్థితుల వల్లే ఈ ఆర్టికల్ తెచ్చారని, దీనిపై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని కరాఖండీగా చెప్పింది. ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందన్న ధర్మాసనం.. భారత్ లో విలీనం తర్వాత ఆ రాష్ట్రానికి ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని తేల్చింది. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకునేది లేదంటూనే ఇప్పటికై దీనిపై మూడు తీర్పులు ఉన్నందున పిటిషనర్లు వాటిని సవాల్ చేయలేదని చెబుతూ పిటిషన్లను కొట్టివేసింది. తద్వారా ఆర్టికల్ 370 రద్దు సబబే అని, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేక హక్కులు అవసరం లేదని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం నిర్ణయం కరెక్టేనన్న సుప్రీం ప్రత్యేక బెంచ్.. ఆ రోజు దీనిద్వారా రక్షణపరమైన చర్యలు మాత్రమే తీసుకున్నారని గుర్తు చేసింది. చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పును ప్రకటించింది.