పదవిలో ఉండగా అరెస్టయిన రెండో CMగా ముద్రపడ్డ అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంపై.. దేశవ్యాప్తంగా పలు పార్టీలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. 2021 నవంబరులో తీసుకువచ్చిన ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు, మనీలాండరింగ్ పై కేజ్రీవాల్ అరెస్టు కాగా.. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే దీనిపై స్పందించారు. గతంలో ఆయనతో పనిచేసిన హజారే.. భేదాభిప్రాయాల వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రికి దూరంగా ఉన్నారు.
స్వయంకృతాపరాధం వల్లే…
అరవింద్ కేజ్రీవాల్ గతంలో మద్యం విధానాలను విమర్శించారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆయనలో మార్పును చూసినట్లు గతంలోనే అన్నాహజారే అన్నారు. ‘కేజ్రీవాల్ అరెస్టు అనేది ఆయన స్వయంకృతాపరాధం(Own Deeds) వల్లే జరిగింది.. ఆయనతో గతంలో పనిచేశా.. కేజ్రీవాల్ అరెస్టు బాధాకరం.. లిక్కర్ పాలసీపై గళమెత్తిన ఆయన చివరకు దాని వల్లే అరెస్టయ్యారు.. ఈ అరెస్టుకు కారణం ఆయన స్వీయ ప్రయోజనాలే.. ఎక్సైజ్ పాలసీకి దూరంగా ఉండాలని రెండు సార్లు లేఖలు రాశా.. ఢిల్లీ సీఎం వినకుండా మద్యం పాలసీని తయారుచేశారు.. ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకోవడం వల్లే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు..’ అని అన్నాహజారే అన్నారు.
2022లో అభిప్రాయభేదాలు…
అరవింద్ కేజ్రీవాల్ అధికార మత్తులో ఉన్నారని.. మద్యం లాగే అధికారం కూడా మత్తు కలిగిస్తుందని.. మీరూ ఆ మత్తులో మునిగిపోయినట్లు కనిపిస్తుందంటూ ఢిల్లీ CMకు 2022 ఆగస్టు 30న హజారే లెటర్ రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఏ ఇతర పార్టీలకు భిన్నంగా లేదని గుర్తు చేశారు. ‘మద్యం విధానాలపై ఆదర్శప్రాయమైన రీతిలో అభిప్రాయాలను తన ‘స్వరాజ్’ పుస్తకంలోనే కేజ్రీవాల్ రాశారు.. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆదర్శాలను మరచిపోయారు.. మీ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది..’ అంటూ హజారే ఆనాడు ఆప్ కన్వీనర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.