
యాపిల్ ఫోన్లు హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు అలర్ట్ మెసేజ్(Alert Messages)లు వచ్చినట్లు విపక్షాల MPలు ఆరోపించడం దేశంలో కలకలానికి కారణమైంది. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్నింగ్ ఈ అలర్ట్ మెసేజ్ లో ఉన్నట్లు MPలు తెలిపారు. శశిథరూర్(కాంగ్రెస్), రాఘవ్ చద్దా(AAP) మహువా మొయిత్రా(తృణమూల్), ప్రియాంక చతుర్వేది(శివసేన-UBT), అసదుద్దీన్ ఒవైసీ(MIM) వంటి నేతలు ఆరోపించడం సంచలనానికి కారణంగా నిలిచింది. మెసేజ్ ల స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. హ్యాకింగ్ జరిగితే డేటా, కెమెరా, మైక్రోఫోన్ వంటివి దుండగులకు చిక్కుతాయని, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని విపక్ష పార్టీల ముఖ్య నేతలు డిమాండ్ చేశారు.
కేంద్రం సీరియస్
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టిసారించినట్లు కేంద్ర IT శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. హ్యాకింగ్ అనుమానాలపై దర్యాప్తునకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT) ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుపుతామన్నారు. ఇలాంటి అలర్ట్ మెసేజ్ లను 150 దేశాలకు యాపిల్ అందించిందని, కస్టమర్ల పర్మిషన్ లేనిదే ఫోన్లలోకి చొరబడటం సాధ్యం కాని రీతిలో IDలను పటిష్ఠం చేసినట్లు యాపిల్ తెలిపినట్లు వైష్ణవ్ గుర్తు చేశారు. దీనిపై సదరు సంస్థ కూడా స్పందించింది. ఈ నోటిఫికేషన్లు కొన్ని నకిలీవి అయి ఉండొచ్చని, మరోవైపు కొన్ని దాడులను గుర్తించలేం అని కూడా వివరించింది.