ఆయనో సీనియర్ IPS అధికారి. హోం, పొలిటికల్ సెక్రటరీగా ప్రభుత్వంలో కీలకం(Key Role)గా వ్యవహరిస్తున్నారు. కానీ ఏడడుగులు వేసిన సహచరిణిని వీడి ఉండలేకపోయారు. భార్య మృతిచెందిందిన్న వార్త విని ఆమె ఉన్న ICUలోకి వెళ్లిన ఆయన.. అక్కడే గన్ తో కాల్చుకుని ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన(Tragic Incident) అసోంలో జరిగింది.
మనస్తాపంతో…
అసోం ప్రభుత్వంలో కీలక అధికారి అయిన IPS శైలాదిత్య చెతియా(44).. ఎన్నో క్రిమినల్, టెర్రరిస్ట్ గ్రూపులను ఉక్కుపాదంతో అణచివేశారు. ఆయన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. భార్య అగమోని బార్బరా(40) మరణాన్ని తట్టుకోలేక చెతియా సూసైడ్ చేసుకున్నారు. 2013 మే 12న వీరిద్దరికీ పెళ్లి కాగా.. పిల్లలు లేరు. కేన్సర్ వ్యాధికి ఆమె గువాహటి(Guwahati)లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఐసీయూలోనే…
సతీమణి తనను విడిచిపెట్టిందన్న వార్త విని ఆమె ఉన్న ICUలోకి వెళ్లారు చెతియా. మెడికల్ స్టాఫ్ పర్మిషన్ తో లోపలికి వెళ్లిన ఆయన.. భార్య మృతదేహం వద్ద కాసేపు ప్రార్థన చేశారు. కానీ 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చెతియా జీవితమంతా కష్టాలతోనే గడిచిందని అసోం మాజీ DGP, ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన భాస్కర్ జ్యోతి మహంత తెలిపారు. భార్య కేన్సర్ తో పోరాడుతుంటే ఈ మధ్యే ఆయన తల్లి, అత్త కూడా కాలం చేశారు. దీంతో కట్టుకున్నదాని వైద్యం కోసం తను ఒక్కడే తరచూ చెన్నై వెళ్లి రావాల్సి వచ్చింది. చెతియా తండ్రి కూడా పోలీస్ ఆఫీసర్ గా టిన్సుకియా, నల్బరి, కోక్రాఝర్, బార్పేట జిల్లాల్లో SPగా పనిచేశారు.