
మణిపూర్ లో అల్లర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. తాజాగా జరిగిన ఘటన చూస్తే అక్కడి ఘర్షణల్లో విదేశీ హస్తం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ నుంచి పెద్దయెత్తున ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ధౌబాల్ జిల్లాలోని ఈ బెటాలియన్ పోస్టుపై వందల సంఖ్యలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒకవేళ అల్లర్లు మొదలై ఏదైనా జరిగితే మిగతా దళాలు అక్కడకు రాకుండా రోడ్లను పూర్తిగా తవ్వేశారు. కానీ అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పాట్ కు చేరుకోవడంతో అల్లరి మూకలు తోక ముడిచాయి. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.
మణిపూర్ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉండొచ్చని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తోపాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా అన్నారు. ఆ రాష్ట్రంలోని చాలా పోస్టుల వద్ద పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగానే ఉన్నాయి. మయన్మార్ కు దగ్గరగా… చైనాకు కేవలం 400 కిలోమీటర్ల దూరంలోనే సరిహద్దులు ఉన్నాయి.