Published 22 Jan 2024
భరతవంశ పాలనకు ప్రతీకగా ఏర్పడిందే భారతదేశం అన్నది పురాతన కాలం నుంచి ఉన్న మాట. వేదాలు, శాస్త్రాలు, అధ్యయనాలు భారతదేశ ఔన్నత్యాన్ని అదే రీతిన చాటాయి. వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో మళ్లీ శ్రీరాముడి పట్టాభిషేకం జరగబోతున్నది. భరతవంశ పాలన తర్వాత జరిగే అతి పెద్ద ఘట్టం ఈ కాలంలో ఇదేనని చాటిచెప్పే విధంగా అయోధ్యలో ‘భవ్య రామ మందిరం(Ayodhya Ram Lalla)’ రూపుదిద్దుకుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చరిత్రను పరిశీలిస్తే ఎన్నో విషయాలు కళ్లకు కడతాయి. అయోధ్య అనేది మన దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఆనాడు ఈ నగరాన్ని ‘సాకేతపురం’ అని కూడా పిలిచేవాళ్లు. బ్రహ్మ మానస పుత్రుడైన ‘మనువు’ నుంచీ అయోధ్య చరిత్ర మూలాలకు సంబంధం ఉంది.
చరిత్రను పరిశీలిస్తే…
సూర్యవంశ రాజైన ఇక్ష్వాకుడు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించాడు. జైన తీర్థంకరుల్లో 22 మంది ఇక్ష్వాకులు ఉండటం కూడా ఈ నగర విశిష్టతకు కారణంగా నిలిచింది. మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడితోపాటు మరో నలుగురు సైతం అయోధ్యలోనే జన్మించారు. తద్వారా హిందూమతంతోపాటు జైన మతానికి పుట్టినిల్లుగా అయోధ్య భాసిల్లింది. ఇదే వంశానికి చెందిన రాజు సగరుడు అశ్వమేధ యాగం(Ashwamedha Yaagam) నిర్వహించగా.. తర్వాత వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేశాడు. అప్పటినుంచి ఈ సూర్యవంశా(Suryavamsham)న్ని ‘రఘువంశం’గా కీర్తిస్తుండగా.. రఘుమహారాజు మనవడైన దశరథుడు 63వ రాజుగా ఏలాడు. ఆయన తనయుడు శ్రీరాముడు(Sri Ramudu) అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. అయోధ్య గొప్పదనమంతా వాల్మీకి రాసిన రామాయణంలో కనిపిస్తుంది. స్కంధ పురాణంతోపాటు వేదాలు సైతం అయోధ్యను దేవనిర్మిత రాజ్యంగా ప్రస్తుతించాయి.
ఇక్ష్వాకు వంశస్థులవే రాజ్యాలు…
ఉత్తర భారతంలోని కోసల, కపిలవస్తు, వైశాలి, మిథిల వంటి రాజ్యాల్ని పాలించింది ఇక్ష్వాకు వంశస్థులే. ఏడో శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ అయోధ్యను ‘పికోసియా’గా సంబోధించాడు. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం, మహాభారతం వరకు ఇక్ష్వాకుల ప్రస్తావన ఉంది. ఈ వంశానికే చెందిన బృహద్రదుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లవుడు శ్రావస్తిని పాలించగా అయోధ్యా నగరం.. మగధకు చెందిన మౌర్యులు, ఆ తర్వాత గుప్తుల కాలంలోకి వెళ్లిపోయింది. తర్వాత కనౌజ్ పాలకుల చేతుల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత మహ్మద్ ఘజనీ మేనల్లుడైన సయ్యద్ సాలార్ అక్కడ టర్కీ పాలన చేయడం క్రమంగా జరిగిపోయాయి. శకుల కాలంలో అయోధ్య షర్కుల అధీనంలోకి చేరుకోగా.. 1440లో మహమూద్ షా పాలన చేశాడు.
బాబర్ దండయాత్రతో…
మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో బాబర్ స్థాపించాడు. అతడి సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించాడు. బాబర్ మనుమడైన అక్బర్ 1580లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజిస్తే అందులో ఒక సుబాగా ఏర్పడిందే అవధ్ సుబా. ఈ అవధ్ సుబాకు రాజధానిగా అయోధ్య ఉంది. 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం ముక్కలై ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటే ఈ అవధ్ సుబా. బాబర్ బాబ్రీ మసీదు నిర్మించాడని, ఆ మసీదు కింద రామ మందిరం ఉందంటూ కరసేవకులు 1992లో కూల్చివేశారు. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు ప్రాంతం తమదేనంటూ హిందూ, ముస్లిం వర్గాలు 1885 నుంచి కలహించుకున్నాయి. 1986లో రామ జన్మభూమికి తాళాలు వేయడంతో వివాదం రగిలింది. రాముడు, సీతాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసే అవకాశమివ్వాలంటూ హిందువులు.. అది తమ ఆస్తి అని ముస్లింలు కేసులు వేస్తూ పోయారు.
సుదీర్ఘ విచారణ…
రామ మందిరమే ధ్యేయంగా ఎల్.కె.అద్వాణీ 1990 సెప్టెంబరు 25న రథయాత్ర ప్రారంభించి గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు నిర్వహించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత 2003లో.. పురాతత్త్వ శాఖ పూర్తి ఆధారాలతో అసలు విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. మసీదు కింద శ్రీరాముని ఆలయం ఉందని నిరూపించడంతో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి 2 భాగాలు హిందువులకు, మరో భాగం ముస్లింలకు చెందుతుందంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఆ తర్వాత వివిధ దఫాలు(Phases)గా సుప్రీంకోర్టులో విచారణ సాగింది. అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసనం.. 2019 నవంబరు 9న రామ మందిరానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అలా 2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది.