Published 24 Jan 2024
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్ఠించిన భవ్య రామ మందిరం.. ఆధ్యాత్మిక పరంగానే కాదు, పర్యాటకంగానూ ప్రపంచంలోనే అగ్రగామి(Top Level)గా నిలవబోతున్నది. ఈ మందిర నిర్మాణంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే మారిపోయేంతగా అభివృద్ధి జరగబోతున్నది. ఈ విషయాల్ని తాజా నివేదికలో SBI తెలియజేసింది. రానున్న రోజుల్లో అయోధ్య.. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా(Tourism Centre) మారబోతున్నదని ఆ రిపోర్ట్ లో స్పష్టం చేసింది. సందర్శకుల(Tourism) విషయంలో వరల్డ్ లోనే తొలి రెండు స్థానాల్లో ఉన్న మక్కా, వాటికన్ సిటీని అధిగమించి అయోధ్య సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు తెలిపింది. కేవలం పన్నుల(Taxes) వసూళ్ల ద్వారానే యూపీ సర్కారుకు 2024-25లో రూ.5,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది.
ఆశ్చర్యకర రీతిలో సందర్శకులు
రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు పునర్వైభవం రానున్నట్లు SBI రిపోర్ట్ తెలియజేసింది. విదేశీ స్టాక్ మార్కెట్ సంస్థ అయిన జెఫరీస్ సైతం ఇదే తీరున అంచనా వేసింది. జెఫరీస్ సంస్థ ఏకంగా ఒకడుగు ముందుకేసి వాటికన్ సిటీ, మక్కాను మించి సందర్శకులు(Visitors) వస్తారని తెలిపింది. రానున్న రోజుల్లో ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారని, తద్వారా యూపీకే కాకుండా భారతదేశ టూరిజానికి మకుటాయమానంగా అయోధ్య వెలుగొందుతుందని చెప్పింది. ప్రపంచ ప్రఖ్యాత(World Famous) ప్రార్థనా స్థలాలైన సౌదీ అరేబియాలోని మక్కాను ఏటా 2 కోట్ల మంది విజిట్ చేస్తుండగా.. ఆ దేశానికి 12 బిలియన్ డాలర్ల(రూ.10 లక్షల కోట్లు) ఆదాయం వస్తున్నది. వాటికన్ సిటీని ప్రతి సంవత్సరం 90 లక్షల మంది సందర్శిస్తుంటే 315 మిలియన్ డాలర్ల(రూ.26,775 కోట్ల) రెవెన్యూ వస్తోంది.
లక్ష నుంచి 3 లక్షలకు…
ప్రస్తుతం అయోధ్యకు రోజుకు లక్ష చొప్పున లెక్కేసుకుంటే రానున్న రోజుల్లో అది 3 లక్షలకు చేరుతుందట. ఒక్కో భక్తుడు రూ.2,500 ఖర్చు చేసినా అయోధ్యకు వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లుగా ఉంటుంది. ఇక అయోధ్యను దర్శించుకునే మార్గంలో వారణాశిలోని కాశీ విశ్వనాథ్, మథురలోని బాంకే బిహారీ ఆలయాల్ని చుట్టి వచ్చే అకాశాలుంటాయి. ఈ మూడు ఆలయాల ద్వారానే UPకి లక్ష కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందట. ఈ రెవెన్యూతో భారతదేశ టూరిజం రూపురేఖలే మారిపోతాయని SBI అంచనా వేసింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. అయోధ్య రామ మందిరం వల్ల ఏటా 4 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత సంపన్న రాష్ట్రంగా అవతరించబోతున్నది.
తిరుపతి, వైష్ణోదేవి ఆలయాల కన్నా…
దేశంలో అత్యధికంగా యాత్రికులు వచ్చే ఆలయం తిరుమల. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాలాజీని దర్శించుకునేందుకు ఏటా 2.5 కోట్ల మంది భక్తులు విచ్చేస్తుంటే రూ.1,200 కోట్ల ఆదాయం లభిస్తోంది. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి ప్రతి సంవత్సరం 80 లక్షల మంది భక్తుల సందర్శనకు గాను రూ.500 కోట్ల రెవెన్యూ వస్తున్నది. ఆగ్రాలోని తాజ్ మహల్ కు 70 లక్షల టూరిస్టులకు గాను రూ.100 కోట్ల రాబడి ఉంది. వీటన్నింటికీ మంచి రానున్న సంవత్సరాల్లో అయోధ్యకు తద్వారా యూపీ రాష్ట్రానికి భారీయెత్తున రాబడి రానుందని తన రిపోర్ట్ లో SBI తెలిపింది.