భారత్ లో పుట్టిన వాళ్లంతా హిందువులే అంటూ జమ్మూకశ్మీర్ మాజీ CM గులాం నబీ ఆజాద్ చేసిన కామెంట్స్… దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దేశంలో పెద్ద టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ ని హిందూ మహాసభ స్వాగతించగా.. ఎవరి ఆనందం కోసం ఇలా మాట్లాడుతున్నారంటూ ముస్లిం లీడర్లు ఫైర్ అవుతున్నారు. ముస్లిం అయిన ఆజాద్ స్వయంగా ఈ కామెంట్స్ చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది . కశ్మీర్ లో ముస్లింలే కాకుండా గుజ్జర్లు కూడా హిందువులేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మరో మాజీ CM ఒమర్ అబ్దుల్లా రెస్పాండ్ అవుతూ… ఏ సందర్భంలో ఆజాద్ అలా మాట్లాడారో అర్థం కాలేదన్నారు. ముస్లింలే కాదు.. యావత్ భారతీయులంతా హిందువులేనని ఆజాద్ మాట్లాడారు. కశ్మీర్ లోని దోడా జిల్లా తాథ్రి రీజియన్ లో జరిగిన ప్రోగ్రాంలో మాట్లాడుతూ సంచలన రీతిలో ప్రసంగించారు. కశ్మీర్ లో 600 ఏళ్ల నాడు ఒక్క ముస్లిం లేడని, చివరకు కశ్మీర్ పండిట్లు సైతం మతం మార్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇస్లాం కంటే హిందూమతం ఎంతో పురాతనమైనదన్న ఆజాద్… కశ్మీర్ లో మాత్రం 600 ఏళ్ల క్రితమే ఇస్లాం వచ్చిందన్నారు. ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందటే వచ్చిందని, ఇక్కడ పుట్టిన వాళ్లంతా హిందువులేనన్నారు. ఇండియాలో స్థిరపడ్డ ముస్లింలలో విదేశాల నుంచి వచ్చినవారు కొందరే ఉంటారన్న ఆజాద్.. మిగతా వారంతా హిందువులేనని గుర్తు చేశారు. ఇస్లాం ఉద్భవించి 1500 ఏళ్లయిందని, కానీ హిందూమతం అంతకంటే ఎంతో పురాతనమైనదని అన్నారు. భారత ఉప ఖండంలో కొందరు మాత్రమే ఫారిన్ ముస్లింలు ఎంటర్ అయ్యారని, మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువగా మత మార్పిళ్లు జరిగి హిందువులు ముస్లింలయ్యారని గుర్తు చేశారు.
ఈ కామెంట్స్ పై ఆల్ ఇండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి సంతోషం వ్యక్తం చేస్తూ ఆజాద్ మాటల్ని స్వాగతిస్తున్నామన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సైతం ఒకప్పుడు హిందువులేనని, కానీ ఇప్పుడు సోదరుల మధ్యే ఘర్షణలు జరుగుతున్నాయని స్వామి చక్రపాణి అన్నారు. మొత్తానికి ఈ కామెంట్స్ ను హిందూ సంఘాలు సంతోషంతో స్వాగతిస్తుంటే ముస్లిం సంఘాలు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.