25,000 మంది టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలు(Recruitments) రద్దు చేస్తూ సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. దీంతో మమతా బెనర్జీ సర్కారుకు భారీ షాక్ తగిలింది. ఎంపిక ప్రక్రియ మొత్తం మోసం, తారుమారు, అక్రమాలతో నిండిందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగాలు తొలగించిన కలకత్తా హైకోర్టు.. తీసుకున్న జీతానికి 12% వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు బాధితులు. హైకోర్టు తీర్పును సమర్థించినా జీతాల రికవరీపై వెసులుబాటు కల్పించింది.
3 నెలల్లో కొత్త నియామకాలు జరపాలంటూ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ఉద్యోగాలు పొందినవారు జీతాల్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పులో తెలిపింది. 2016లో నిర్వహించిన పరీక్షల ద్వారా 25,754 మంది ఉద్యోగాలు పొందారు. అందులో కొందరు అక్రమ మార్గాన ఉద్యోగాలు సంపాదించారు. ఈ నియామకాల్లో అదనపు పోస్టులను అనుమతించిన అధికారులను అదుపులోకి తీసుకోవాలని CBIని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై CBI, ED దర్యాప్తు చేపట్టి నివేదికల్ని అందించగా.. అక్కడి హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్షణ తీసుకోకుండా ఉద్యోగాలు పొందారు. ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదన్న హైకోర్టు.. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలల పాటు విధుల్లో కొనసాగేలా ఆదేశాలిచ్చింది. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతం తీసుకోవాలన్న కోర్టు.. నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చేశారంటూ మండిపడింది. అయితే వడ్డీతో కలిపి లక్షల జీతాలు ఎక్కణ్నుంచి తెచ్చేదంటూ బాధితులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు.