దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న(Bharat Ratna)’ను కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురు దిగ్గజాలకు ప్రకటించింది. ఇప్పటికే ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించగా… మరో ముగ్గురికి ప్రదానం చేయబోతున్నది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. మాజీ ప్రధానులు పాములపర్తి వెంకట(పి.వి.) నర్సింహారావు, చౌదరి చరణ్ సింగ్ తోపాటు హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ కు ఈ పురస్కారాల్ని ప్రకటించినట్లు ‘X(ట్విటర్)’లో ప్రధాని తెలియజేశారు.
మొత్తంగా ఐదుగురికి..
ఈ సంవత్సరం(2024)కు గాను ఐదుగురిని ‘భారతరత్న’ పురస్కారం వరించింది. తొలుత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ను ఎంపిక చేయగా.. రెండో వ్యక్తిగా BJP సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఈ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరో ముగ్గురికి ‘భారతరత్న’ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం అందజేయబోతున్నది. ఈ గౌరవం దక్కిన రెండో తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేసిన పీవీ.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించగా రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయన్ను దత్తత తీసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వంగరకు తీసుకెళ్లారు. 1972లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు సేవలందించారు.
ఆహార ఆద్యుడు…
ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించే వరకు వ్యవసాయ శాస్త్రవేత్త(Agriculture Scientist)గా ఎం.ఎస్.స్వామినాథన్ దేశానికి ఎంతో సేవ చేశారు. వినూత్న పరిశోధనలతో కొత్త వంగడాల్ని కనుగొని హరిత విప్లవ పితామహుడిగా నిలిచారు. తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న జన్మించిన స్వామినాథన్.. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. జనరల్ సర్జన్ అయిన తండ్రి M.K.సాంబశివన్ కు స్వామినాథన్ ను డాక్టర్ చేయాలనుండేది. కానీ జువాలజీ చదివిన స్వామినాథన్.. వ్యవసాయరంగంపై దృష్టి పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత ఉప ఖండంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన సమయంలో స్వామినాథన్ తీసుకువచ్చిన విధానాలు దేశాన్ని సుభిక్షంగా బయటపడేయగలిగాయి.
చరణ్ సింగ్
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీప నూర్పూర్ లో 1903 డిసెంబరు 23న చౌధురి చరణ్ సింగ్ జన్మించారు. అహింసాయుత మార్గాన్ని ఎంచుకుని గాంధీ బాటలో నడిచిన చరణ్.. ఎన్నోసార్లు బ్రిటిష్ ప్రభుత్వంలో జైలు పాలయ్యారు. ఉప్పుపై తెచ్చిన చట్టాల్ని నిరసిస్తూ 1930లో జైలు పాలై 12 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. 1979 జులై 28 నుంచి 1980 జనవరి 14 వరకు భారత ఐదవ ప్రధానిగా సేవలందించారు. ముందునుంచీ కాంగ్రెస్ వాదిగా ఉన్న చరణ్ సింగ్… 1980 లోక్ దళ్ పార్టీని స్థాపించారు.
Published 09 Feb 2024