భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజకీయ రంగంలో విశేష సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న(Bharat Ratna)’ పురస్కారాన్ని(Award) ప్రకటించింది. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించినట్లు మోదీ ట్వీట్(Tweet) ద్వారా తెలియజేశారు. అద్వానీతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వంలో 2002 నుంచి 2004 వరకు అద్వానీ.. భారత ఏడో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.
సుదీర్ఘకాలం సేవలందించిన వ్యక్తిగా…
1998 నుంచి 2004 వరకు సుదీర్ఘ కాలంగా హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖను చూశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)లో ముందునుంచీ క్రియాశీలక పాత్ర(Crucial Role) పోషించిన ఈ రాజకీయ కురువృద్ధుణ్ని… 2009 సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించి ఎన్నికలకు వెళ్లింది. అవిభాజ్య భారత్ లో భాగంగా నేటి పాకిస్థాన్ కరాచీలో 1927 నవంబరు 8న జన్మించిన అద్వానీ.. ముంబయిలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులోనే 1941లో RSSలో జాయిన్ అయిన ఈయన.. అప్పుడే రాజస్థాన్ ప్రచారక్ గా నియమితులై సంచలనం సృష్టించారు. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి భారతీయ జన సంఘ్ ను ప్రారంభించారు. పాక్ కరాచీలో హైస్కూల్ వరకు.. సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్ లో కాలేజీ విద్యను పూర్తి చేసుకున్నారు.
రాజకీయంగా ఉన్నతస్థాయిలో…
మొట్టమొదటిసారిగా 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు అద్వానీ. 1989 వరకు అలా వరుసగా నాలుగు సార్లు ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1973లో జనసంఘ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తే.. 1977 జనరల్ ఎలక్షన్స్ లో జనసంఘ్ కాస్తా జనతాపార్టీలో విలీనమైంది. ఆ ఎన్నికల్లో జనతాపార్టీ అధికారం చేపట్టడంతో అద్వానీ.. రాజ్యసభ సభ్యుడిగా సమాచార, ప్రసారశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయీతోపాటు 1980లో BJPని స్థాపించిన ఈ రాజకీయ తొలి తరం నేత.. 1989లో లోక్ సభలో అడుగుపెట్టారు. బీజేపీకి మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర అద్వానీది. 2019 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఈ సీనియర్ నేత 2015లో ‘పద్మవిభూషణ్’ అందుకున్నారు. 2019 నుంచే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.