నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందంటూ సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నెల 16న దేశ వ్యాప్త బంద్ పాటించాలని కోరింది. దీనికి మద్దతుగా వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీలు మద్దతు తెలపబోతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price-MSP) ఇవ్వడంతోపాటు దీనిపై చట్టం చేయడం.. 2020లో జరిగిన ఆందోళనల్లో పెట్టిన కేసుల్ని కొట్టివేయడం వంటి డిమాండ్లతో రైతులు ఈ నెల 13న ఛలో ఢిల్లీకి పయనమయ్యారు.
దేశ రాజధాని హస్తినను స్తంభింపజేసేందుకు పంజాబ్(Punjab), హరియాణా(Haryana) రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఢిల్లీకి బయల్దేరారు. వీరిని అడ్డుకునేందుకు దేశ రాజధాని సరిహద్దుల్లో వేల సంఖ్యలో కేంద్ర బలగాల్ని మోహరించారు. అయినా నిరసనకారులు చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో బాష్పవాయుగోళాల్ని(Tear Gas) ప్రయోగించారు. అక్కడ నిన్నటి నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సిఫార్సుల అమలుకు డిమాండ్…
ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆందోళనకు కారణమైన లఖీంఫూర్ ఖేరీ ఘటనలో మృత్యువాతపడ్డ వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటున్నారు. ఈ డిమాండ్లన్నీ అమలు చేసేవరకు ఢిల్లీని అష్టదిగ్బంధనం చేస్తామంటున్నారు.