పోలీసులు, మావోయిస్టుల మధ్య మరోసారి జరిగిన భీకర ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా దండకారణ్యం(Dense Forest)లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(DRG)తోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF) బలగాలు గాలింపు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ కు దారితీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్ని నెలల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లివి…
* 2025 జనవరి 21…: ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లా మైన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల పాటు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ దాడిలో 14 మంది మావోయిస్టులు చనిపోగా అందులో కేంద్ర కమిటీ సభ్యుడున్నారు. అతనిపై కోటి రూపాయల రివార్డుంది.
* 2025 జనవరి 6…: ఈసారి మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. బీజాపూర్ జిల్లా అంబోలి బ్రిడ్జి వద్ద IED పేల్చడంతో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో పేలుడు జరిగి 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
* 2024 జులై 17…: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.
* 2024 జూన్ 15…: ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
* 2024 ఏప్రిల్ 16…: అబూజ్ మడ్ లోని బైనగుండా-కోరోనర్ సమీపంలో హెపటోలా ప్రాంతంలో జరిగిన భీకర దాడిలో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. BSF, DRG దళాలు జరిపిన దాడిలో సీనియర్ కమాండర్లు శంకర్ రావు, లలిత ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కీలకంగా పనిచేసే వినోద్ గావ్డే, రాజ్మన్ చనిపోయారు.
* 2024 ఏప్రిల్ 2…: బీజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది చనిపోయారు. అందులో ఇద్దరిపై రూ.43 లక్షల రివార్డు ఉంది.
* 2024 నవంబరు 22…: సుక్మా జిల్లాలోని కొంటభెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో 10 మంది మావోలు హతమయ్యారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గఢ్-ఒడిశా రాష్ట్రాల జంక్షన్ అయిన ఈ ప్రాంతంలో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.