Published 25 Jan 2024
ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, భగవంత్ మాన్ తో తల బొప్పి కట్టించుకున్న విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance)కి మరో ముఖ్యమంత్రి తోడయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల్లేవ్ అంటూ మమత, మాన్ నిర్మొహమాటంగా చెబితే.. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ఈ కామెంట్స్ పొత్తులు, కూటమిపై కాకుండా ‘భారతరత్న’ పురస్కారం(Award) విషయంలో కావడం విశేషం. అప్పటి యూపీఏ(United Progressive Alliance), నేటి ఎన్డీయే(National Democratic Alliance) ప్రభుత్వాల పాలనా తీరును ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UPA సర్కారుది రాచరిక పాలన అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘భారతరత్న’పై లేఖలు రాసినా..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. నితీశ్ కుమార్ గురువైన కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ‘భారతరత్న’ రావడం పట్ల బిహార్ లో సంబరాలు మిన్నంటాయి. ఆయన శత జయంతి వేడుకల్లో పాల్గొన్న నితీశ్.. రెండు కూటముల పాలనను వివరిస్తూ మాట్లాడారు. ‘కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని ఎన్నోసార్లు లెటర్లు రాశా.. నేను 2005లో బిహార్ లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి తన గురువుకు అత్యున్నత అవార్డు ఇవ్వాలని కోరా.. కానీ నాటి UPA సర్కారు ఏ మాత్రం పట్టించుకోలేదు.. ఆ ప్రభుత్వానిది పూర్తిగా రాచరిక పాలనే.. కుటుంబ పాలనను దూరం పెట్టి నాలాంటి వాళ్లను పాలిటిక్స్ లోని తీసుకువచ్చింది ఠాకూరే.. అలాంటి వ్యక్తికి తగిన గౌరవాన్నించేందుకు కూడా UPA సర్కారు అంగీకరించలేదు’.. అని విమర్శించారు.
మోదీ వల్ల నెరవేరిన కల…
ఈ విషయంలో ప్రధాని మోదీపై నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ‘కర్పూరి ఠాకూర్ కు ‘భారతరత్న’ ఇవ్వాలని ఏనాడూ మోదీ సర్కారును అడగలేదు.. కానీ కర్పూరి తనయుడు, MP అయిన రామ్ నాథ్ ఠాకూర్ ను స్వయంగా మోదీయే పిలిపించుకున్నారు.. ఇందుకు నన్ను కూడా రమ్మనలేదు.. కర్పూరి సేవల్ని గుర్తించారు కాబట్టే ప్రధాని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.. అసలైన ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది’.. అంటూ నితీశ్ కామెంట్స్ చేశారు. కుటుంబ పాలనపై ఇలా మాట్లాడటం బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మొత్తంగా ఇలాంటి మాటలతో మరోసారి ఇండియా కూటమిని ఇరుకున పెట్టారు నితీశ్.
లాలూ కుటుంబంపైనేనా…
ఇండియా అలయెన్స్ లో భాగస్వాములుగా నితీశ్ పార్టీ జేడీ(యూ)తోపాటు RJD ఉన్నాయి. లాలూ కుటుంబానికి చెందిన ఐదుగురు.. RJDలో కీలక స్థానాల్లో ఉన్నారు. లాలూ సతీమణి రబ్రీదేవి MLCగా ఎన్నికై ఇప్పటికే CMగా పనిచేశారు. వీరి పెద్ద కుమార్తె మీసా భారతి MPగా ఉన్నారు. లాలూ-రబ్రీ తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్.. ప్రస్తుత నితీశ్ గవర్నమెంట్ లో మంత్రులు. ఇలా కుటుంబ రాజకీయాలపై నితీశ్ కామెంట్స్ చేయడంతో అవి లాలూ కుటుంబానికి తగిలినట్లేనన్న ప్రచారం బిహార్ లో జోరుగా సాగుతోంది.