కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)కు లోక్ సభలో అపూర్వ మెజార్టీ లభించింది. ఈ బిల్లును కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకిస్తే.. 454 మంది ఆమోదం తెలిపారు. పార్లమెంటు కొత్త భవనంలో తీసుకొచ్చిన తొలి బిల్లుకు మోక్షం లభించింది. ఈ బిల్లు కోసం మోదీ సర్కారు మంగళవారం నాడు రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును నిన్న లోక్ సభ ముందుకు కేంద్రం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. ఈ బిల్లులో అనేక అంశాలు ఉన్నందున ఇప్పటికిప్పుడు అమలయ్యే అవకాశం లేదన్నది ఎక్కువ మంది సభ్యులు అభిప్రాయం. నియోజకవర్గాల పునర్విభన(Delimitation)లో భాగంగా జనాభా నిష్పత్తి, సెగ్మెంట్లకు అనుగుణంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తామని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. అయితే SC, ST లతోపాటు BCలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని మెజార్టీ సభ్యులు అన్నారు. ఈ బిల్లుకు మొత్తం 454 మంది అనుకూలంగా ఓటేస్తే ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. దీంతో 2/3 వంతు మెజార్టీతో లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఎరుపు(Red), ఆకుపచ్చ(Green) స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు.
బిల్లులో పొందుపరిచిన అంశాలు, చేపట్టాల్సిన సవరణలపై లోక్ సభలో పూర్తిస్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు. 1996లో దేవెగౌడ సర్కారు తొలిసారిగా తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చ సాగింది. రాజీవ్ గాంధీ హయాంలో 72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పట్నుంచి చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. ఆ కాలంలో RJD, సమాజ్ వాదీ పార్టీలు అంగీకరించకపోవడంతో అది మరుగున పడిపోయింది. తర్వాత 2004-2014 మధ్య అధికారంలో ఉన్న UPA హయాంలో భాగంగా 2010 మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టారు. లోక్ సభకు బదులు ఆనవాయితీకి భిన్నంగా తొలుత దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత లోక్ సభకు పంపించాలని భావించినా అది కుదరలేదు. లోక్ సభ రద్దయితే బిల్లు కూడా రద్దయిపోతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో అలా బిల్లు కార్యాచరణకు నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం BJP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. రేపు దీనిపై రాజ్యసభలోనూ చర్చ జరగనుంది.