సాధారణంగా టాయిలెట్లు చూస్తేనే అధ్వానంగా ఉంటాయి. వాటిని పట్టించుకునేవారు లేక అటువైపు వెళ్లాలంటేనే మనసు ఒప్పుకోదు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ మరుగుదొడ్ల నిర్మాణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు సులభ్ ఇంటర్నేషన్ అధినేత బిందేశ్వర్ పాఠక్. కొన్ని కోట్ల మందికి వాటిని ఉచితంగానే అందుబాటులోకి తీసుకొచ్చారాయన. సామాజిక అభివృద్ధికి పరిశుభ్రతే కీలకమని నమ్మి ఆ దిశగా కోట్లాది టాయిలెట్లను నిర్మింపజేసిన బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. మరుగుదొడ్లను కూడా ఒక ఉద్యమంలా చేపట్టి సామాజిక బాధ్యతను నిర్వర్తించిన బిందేశ్వర్.. దిల్లీలోని ఎయిమ్స్(AIIMS)లో హఠాన్మరణం చెందారు. సులభ్ ఇంటర్నేషనల్ పేరిట దేశవ్యాప్తంగా ఆయన… 5.4 కోట్ల టాయిలెట్లు కట్టించి పేదవారికి ఎక్కడ పడితే అక్కడ వాటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దిల్లీలోని మెయిన్ ఆఫీస్ లో జెండా ఎగురవేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్ కు తరలించినా ప్రాణాలు దక్కలేదు.
ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
ఒక సామాజికవేత్త, పేదల కోసం పనిచేసిన ఉద్యమకారుడు మరణించారంటూ బిందేశ్వర్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆయన అందించిన సేవలు మరువలేనివని.. ‘క్లీన్ ఇండియా’ కోసం బిందేశ్వర్ అందించిన సహకారం ఎనలేనిదని ప్రధాని గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన పాఠక్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నానని తన ట్వీట్లో PM తెలియజేశారు.