PHOTO: THE TIMES OF INDIA
పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరికొంతమందికి గాయాలు కాగా.. మృతుల్లో పలువురు మహిళా సిబ్బంది ఉన్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని అక్కడి అధికారులు అంటున్నారు. దత్తపుకార్ సమీపంలో వెస్ట్ బెంగాల్ స్టేట్ యూనివర్సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. నీల్ గంజ్ మోష్ పోల్ ఏరియాలో గల ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఆదివారం పొద్దున 10 గంటలకు పేలుడు చోటుచేసుకుంది.
బిల్డింగ్ ఆనవాళ్లు లేకుండా కూలిపోగా.. మృతదేహాలు ఎగిరిపడి రోడ్డుపై పడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని దగ్గర్లోని బరాసత్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరింత మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.