కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ED, CBI కేసుల్లో ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్ పోర్టు స్వాధీనం చేయాలంటూనే రెండు కేసుల్లో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం(Bench) ఎదుట గంటన్నరకు పైగా వాదనలు జరిగాయి.
ఆమె ఫోన్లు మార్చారని, డేటాను మొత్తం తొలగించి తప్పు చేశారంటూ ED తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ASG) వాదించారు. ఫోన్ ఫార్మాట్ కాదు.. ఆధారాల్ని ఫార్మాట్ చేశారా అని బెంచ్ ప్రశ్నించింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని బెంచ్ తెలిపింది.
ఇక బెయిల్ పిటిషన్ పై BRS నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. కేసు విచారణ జరగనుండటంతో కవిత భర్త అనిల్, సోదరుడు KTR, హరీశ్ రావు సహా పలువురు నాయకులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. ED కేసులో ఐదున్నర నెలలుగా, CBI కేసులో నాలుగున్నర నెలలుగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు.
బెయిల్ ఇవ్వడానికి మూడు ప్రధాన కారణాల్ని సుప్రీం వివరించింది. ఫైనల్ ఛార్జిషీట్ ను CBI దాఖలు చేస్తే.. ED సైతం దర్యాప్తు పూర్తి చేసింది.. కాబట్టి నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదు.. అని సుప్రీం స్పష్టం చేసింది.