అసలే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీటి వనరులు అడుగంటిపోయి(Dry) తాగునీటికే ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇక మెట్రో నగరాల్లో పరిస్థితి మరీ దారుణం(Critical Situation)గా తయారైంది. తాగడానికే నీరు లేదు మహాప్రభో అంటే.. ఇక వాహనాల్ని కడగడమంటే ఎంతటి నిర్లక్ష్యం. అందుకే చిర్రెత్తుకొచ్చిన కార్పొరేషన్ అధికారులు… భారీగా ఫైన్ వేశారు. నీటిని వృథా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారం క్రితమే హెచ్చరించింది బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్. అయినా ఆ మాటలు పెడచెవిన పెట్టడంతో భారీగా ఫైన్ వేసింది.
22 మందికి జరిమానాలు…
బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(BWSSB) నిబంధనల్ని ఉల్లంఘించి మరీ కార్లను వాష్(Car Wash) చేశారు. అలాంటి 22 మందిని గుర్తించిన అధికారులు వారందరికీ రూ.1.1 లక్షల జరిమానా వసూలు చేశారు. గత మూడు రోజుల్లోనే బెంగళూరు కార్పొరేషన్ కు లక్షకు పైగా నగదు ఫైన్ల ద్వారా వచ్చినట్లు BWSSB ఛైర్మన్ వి.రామ్ ప్రశాంత్ మనోహర్ తెలిపారు. కావేరి నదితోపాటు సమీప బోర్ల నుంచి నీటిని తరలించి కార్ల వాషింగ్ చేశారు. కార్ల వాషింగ్, గార్డెనింగ్, పెద్ద కట్టడాలకు నీటిని వాడితే రూ.5,000 చొప్పున ఫైన్ వేస్తామని ఈనెల 10నే BWSSB ప్రకటించింది.
తీవ్ర ఎద్దడితో…
బెంగళూరు ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. నల్లాలకు పైపులు బిగించి స్ప్రే ద్వారా వాహనాల్ని కడగడం వల్ల భారీగా నీరు వేస్ట్ అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర రాజధానిలో నీటి నిల్వలు లేకపోవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు బెంగళూరు డెవలప్మెంట్ మినిస్టర్ డి.కె.శివకుమార్ సైతం ఆందోళన కనబరిచారు. మొన్నటి వానలు బెంగళూరు సిటీలో ఏ మాత్రం భూగర్భ జలాల్ని పెంచలేకపోయాయి. దీంతో తాగడానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ‘కావేరి నీరవేరి నిగమ’ సంస్థ.. KRS, కబిని రిజర్వాయర్లను సిద్ధం చేసి పెట్టింది.