దేశంలో కులగణన అనేది 1931 తర్వాత అసలు జరగనే లేదు. జనాభా లెక్కల మాదిరిగా SC, STల లెక్కల్ని మాత్రమే పదేళ్ల కోసం పరిగణిస్తున్నారు(Count). BCలు, ఇతర కులాల సంఖ్య గురించి స్పష్టమైన వివరాలు బయటకు రావడం లేదు. దీంతో దేశంలో 60 శాతానికి పైగా ఉన్న వెనుకబడ్డ వర్గాల గురించి సమగ్ర సమాచారం వెలికితీసేందుకు కులగణన చేపట్టాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా గత మూడేళ్ల నుంచి ఊపందుకున్నాయి. బీసీలో కులాల జాబితా చాంతాడంత ఉంటుంది. ఇందులో మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(MBC)లను గుర్తించడం, వారికి అందాల్సిన ప్రయోజనాల కోసం ప్రత్యేక పథకాలు(Schemes) ప్రవేశపెట్టడం దీని అసలు ఉద్దేశం.
తుట్టె కదిపిన బిహార్…
దేశంలో కులగణన తుట్టెను కదిపిన తొలి రాష్ట్రంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు నిలిచింది. బిహార్ లో కులగణన వివరాల్ని 2023 అక్టోబరు 2న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర మొత్తం జనాభా(Population) 13 కోట్ల 7 లక్షలకు గాను 63 శాతానికి పైగా OBCలు, EBCలే ఉన్నారు. అగ్రకులాలకు చెందినవారు 15.5 శాతం ఉంటే, 20 శాతం SCలు, 1.6 శాతం STలు ఉన్నారు. యాదవ సామాజికవర్గమే అక్కడ 14.26 శాతంగా తేలింది. 2024 ఎన్నికల్లో గెలిస్తే దేశవ్యాప్త కులగణన చేపడతామని రాహుల్ గాంధీ గతేడాదే హామీ ఇచ్చారు.
ఆ దిశగా రాష్ట్రాలు…
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం నిన్న(ఫిబ్రవరి 16న) శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది. గతంలోనే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం ఇదే తీరున తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక బిహార్ తర్వాత కులగణనపై అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని గత సర్కారు.. కులగణనకు రెడీ అయింది. కానీ అక్కడ అధికారం చేతులు మారి BJP ప్రభుత్వం కొలువుదీరింది. అటు ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని BJD(Biju Janatha Dal) పార్టీ సైతం కులగణన దిశగా అడుగులు వేస్తామని గతంలోనే ప్రకటించింది. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన చేస్తామని BJP ప్రకటించినా ఇప్పుడు దానిపై ఆ పార్టీ ముందుకు రావడం లేదు.
చట్టం కోసం డిమాండ్…
రాష్ట్రంలో చేపట్టబోయే కులగణన(Caste Survey)లో అన్ని కులాల్ని పరిగణలోకి తీసుకోనున్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. కానీ ఇక దానిపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు ఈ కులగణన కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. శాసనసభ(Assembly)లో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని చట్టంగా చేస్తేనే ప్రయోజనం ఉంటుందని విపక్ష BRS సభ్యులు అన్నారు. తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ అంతటితోనే వదిలిపెట్టకుండా దీన్ని చట్టం చేస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. దీనిపై బిల్లు ప్రవేశపెడతామని గతంలోనే చెప్పారని, కానీ ఇప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టడమంటే మాట తప్పడమేనని విపక్ష సభ్యులు తప్పుబట్టారు. BCలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున తమ ఐదేళ్ల పాలనలో లక్ష కోట్ల రూపాయలు అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. మొన్నటి బడ్జెట్ లో కేవలం రూ.6 వేల కోట్లే ప్రవేశపెట్టడాన్ని గుర్తు చేశారు.