Published 25 Nov 2023
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) వార్నింగ్ ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం తగదంటూ స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ వాటిని తీవ్రంగా తీసుకుంటామంటూ హెచ్చరించి వదిలిపెట్టింది. ఇందుకు గాను KCRకు లెటర్ రాసిన CEC సలహా(Advisory) కమిటీ.. దాన్ని CM అందజేయాలంటూ స్టేట్ ఎలక్షన్ ఆఫీసుకు పంపించింది. ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం నిబంధనల ఉల్లంఘనకు కిందకు వస్తుందని, దాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రెచ్చగొట్టేలా మాట్లాడినట్లయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తులు లేదా పార్టీల అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం మాట్లాడే హక్కు ఉన్నా దానికి కొన్ని నిర్దిష్ట పరిమితులు ఉన్నాయని వివరించింది.
జరిగిన విషయం ఇది…
అక్టోబరు 30న నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్.. పరుష పదాలు ఉపయోగిస్తూ ప్రసంగించారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లపై ప్రతిపక్ష పార్టీల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పరుష పదాలను ఉపయోగించడమే కాకుండా రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ CECకి కంప్లయింట్ అందింది. CM ప్రసంగం తీరుపై NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. దీనిపై రిపోర్ట్ పంపాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చిన వివరణ ఆధారంగా కేసీఆర్ మాట్లాడినదాంట్లో పరుష పదాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన CEC అడ్వయిజరీ కమిటీ.. ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తూ లెటర్ పంపించింది. అంతకుముందు ECకి కంప్లయింట్ ఇచ్చినా సీఎంపై చర్యలు తీసుకోవడం లేదంటూ కొద్దిరోజుల క్రితమే బల్మూరి వెంకట్.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఈసీ వార్నింగ్ ఇవ్వడంతో ఎన్నికల టైమ్ లో ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అంతే సంగతులు అన్న విషయం స్పష్టమైనట్లయింది.