పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటిస్తూ దీనిపై నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ చట్టం కార్యరూపం దాల్చినట్లయింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడమే పౌరసత్వ సవరణ బిల్లు ఉద్దేశం. 2014 డిసెంబరు 31కి ముందు భారత్ కు వచ్చిన ముస్లిమేతరులకు ఈ పౌరసత్వం లభిస్తుంది.
చట్టం ఎలా ఉంటుంది…
2015కు ముందు భారత్ కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం దక్కనుంది. 2019 డిసెంబరులో ఈ చట్టానికి ఆమోదం లభించింది. ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఇది అమల్లోకి రాకపోగా.. ఇప్పుడు కేంద్రం నోటిఫై చేయడంతో ఇక ఇది పని ప్రారంభిస్తుంది. ఇప్పుడు కేంద్రం దీనిపై నిబంధనల్ని కూడా ప్రకటించింది.
పెద్దయెత్తున నిరసనలు…
ఈ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరులను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అసోంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో హింస చెలరేగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు దేశాలకు చెందిన ముస్లిమేతర శరణార్థుల వద్ద సరైన పత్రాలు లేకున్నా వారికి సత్వర పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.
ఎంతమందికి…
1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి తెచ్చిన 2019 యాక్ట్ ద్వారా 30 వేల మందికి లబ్ధి కలగనుంది. 2014 డిసెంబరు 31కి పూర్వం దేశంలోకి ప్రవేశించి.. పాక్, బంగ్లా, అఫ్గాన్ దేశాల్లో మతపరమైన హింస అనుభవించిన వలసదారులు ఈ చట్టానికి అర్హులు. భారత్ లో 11 ఏళ్లపాటు శరణార్థులుగా ఉన్నవారికే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో నిబంధన ఉంది. అయితే మోదీ సర్కారు దీన్ని సవరిస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గత 14 సంవత్సరాల్లో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్ లో నివసించిన వారే ఈ చట్టానికి తగినవారు అని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో ఉండటం వల్ల గిరిజన ప్రాంతాలు కావడంతో అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలను ఈ చట్టం నుంచి మినహాయించింది.