రెండో దశ ప్రయాణం కోసం ఇస్రో చేస్తున్న ప్రయత్నాలకు చంద్రయాన్-3 నుంచి రెస్పాన్స్ రావడం లేదు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నుంచి ఇప్పటివరకు సిగ్నల్స్ అందలేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అయితే చంద్రునిపై వెలుతురు ఉండే ఈ 14 రోజులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఒకవేళ చంద్రయాన్-3 కనెక్ట్ అయితే మాత్రం మళ్లీ ప్రయోగాలు కొనసాగిస్తుందని సోమనాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉన్న చంద్రయాన్-3.. మలిదశ ప్రయాణంపై అందరిలోనూ ఉత్కంఠ కనిపించింది. తొలి దశలో ఆగస్టు 23 నుంచి 14 రోజుల పాటు విస్తృతంగా రీసెర్చ్ చేసిన ల్యాండర్, రోవర్.. ఇస్రోకు భారీగా డేటాను పంపించింది. ఆ డేటాతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO).. పూర్తి స్థాయిలో విశ్లేషణ(Analyze) చేస్తున్నది. వెలుతురు ఉండే ఈ 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్ ను బయటకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతాయని, తొలి రెండు మూడు రోజులు అది సాధ్యం కాకపోయినా మిగతా రోజుల్లో వాటి నుంచి సిగ్నల్ అందే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటున్నారు.
ఈ నెల 22 నుంచి మళ్లీ సూర్యరశ్మి రావడంతో ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తాయేమోనన్న ఆశ కనపడింది. వెలుతురు రాక మొదలైన ఇప్పటిదాకా అక్కణ్నుంచి సిగ్నల్స్ అందలేదు. నిద్రాణ వ్యవస్థలో ఉన్న ల్యాండర్, రోవర్ మైనస్ 250 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి బయటకు రావాల్సి ఉండగా.. అందుకోసం ఇస్రో శతథా యత్నిస్తున్నది. కేవలం 14 రోజులు మాత్రమే పనిచేసేలా చంద్రయాన్-3ని డిజైన్ చేసింది ఇస్రో. ఇప్పటికే అనుకున్న టార్గెట్ ను అవి రీచ్ అయ్యాయి. ఒకవేళ మైనస్ 250 డిగ్రీల టెంపరేచర్ ను తట్టుకుని నిలబడగలిగితే.. మళ్లీ ప్రయోగాలు చేపట్టే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అదే జరిగితే అది భారత్ కు బోనస్ లాంటిదని చెబుతున్నారు.