దేశంలో ఇక మోడ్రన్ రైల్వే వ్యవస్థ రాబోతున్నదని, 1,000 కిలోమీటర్ల మేర కొత్త కనెక్టివిటీ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 100 శాతం విద్యుదీకరణ లక్ష్యమని, ఇప్పటివరకు 35 శాతం పూర్తయిందన్నారు. హైదరాబాద్ చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్నదని, 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు కొత్త ట్రాక్ లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యావరణ హితంగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ కు రూ.413 కోట్లు వెచ్చించారు. 2024 డిసెంబరు 28 నాడే ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ మరణంతో ఈరోజుకు వాయిదా వేశారు.
టెర్మినల్ విశిష్టతలు ఇలా…
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ
ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు అందుబాటులో ఉండటంతో జంటనగరాల్లో ఎక్కణ్నుంచైనా సులువుగా చేరుకునే వీలు
ఆరు బుకింగ్ కౌంటర్లు.. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు
ఒక ప్లాట్ ఫాం నుంచి మరో ప్లాట్ ఫాంకు వెళ్లేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జి
మొత్తం 9 ప్లాట్ ఫాంల్లో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు
బస్ బేతోపాటు కార్లు, బైక్ ల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం