సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. రెండు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్థానానికి జడ్జిలుగా వెళ్లబోతున్నారు. తెలంగాణ, కేరళ చీఫ్ జస్టిస్ లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజీయం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కు ప్రమోషన్ లభించింది. సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. అటు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటనారాయణ భట్టిని సైతం సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా… ప్రస్తుతం 31 మంది ఉన్నారు. సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన కొలీజియం… ఈ న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబరు 17న గువాహటి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.