

తుపాను ప్రభావానికి 150 కి.మీ. వేగంతో వీచే గాలులతో నష్టం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో… ప్రజల తరలింపు ప్రారంభమైంది. గుజరాత్ లోని తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బిపర్ జాయ్ తుపాను దృష్ట్యా ఇప్పటివరకు 30 వేల మందిని తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిపి మొత్తం 29 బృందాలు విధుల్లో పాలుపంచుకుంటున్నాయి. గుజరాత్ లోని జఖౌ పోర్టు సమీపంలో ఈనెల 15న తీరం దాటనున్న తుపాను.. భారీ నష్టం కలిగించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కచ్, ద్వారక, జామ్ నగర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కానుండగా, అతి తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారి జఖౌ వద్ద తీరం దాటనుంది. ఆ సమయంలో గరిష్ఠంగా 150 కి.మీ. వేగంతో గాలులు ఉండే అవకాశం ఉందని, ఈ తుపాను కలిగించే నష్టం తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
25 సెం.మీ. వర్షం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదని అధికారులు అంటున్నారు. ఇళ్లు, రోడ్లు, విద్యుత్తు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి వాతావరణశాఖ తెలియజేసింది.