
Published 24 Dec 2023
అతడో ప్రొఫెసర్. అక్కడ జరుగుతున్నది ఆరోగ్యానికి సంబంధించిన సదస్సు. హెల్త్ జాగ్రత్త అంటూ ఆ మాస్టారు స్టేజీ పై నుంచి పిల్లలకు బోధిస్తూనే ఉన్నాడు. అలా ప్రసంగం కొనసాగుతుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. చివరకు అతణ్ని హాస్పిటల్ కు తరలించినా లాభం లేకుండా పోయింది. ఈ విషాదకర ఘటన(Tragedy Situation) ప్రముఖ విద్యాసంస్థ అయిన IIT కాన్పూర్ లో జరిగింది.
IIT కాన్పూర్ లో మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ హెడ్ గా పనిచేస్తున్న 53 ఏళ్ల సమీర్ ఖండేకర్.. గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ‘ఆరోగ్యాన్ని కాపాడుకోవటమెలా’ అన్న అంశంపై క్యాంపస్ లో సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో సమీర్ ఖండేకర్ ప్రసంగిస్తూ పిల్లలకు జాగ్రత్తల గురించి చెబుతున్నారు. ‘మీ అందరి ఆరోగ్యాలు జాగ్రత్త’ అని చెబుతూనే ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే ఆ డీన్ ను సమీపంలోని లక్ష్మీపతి సింఘానియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీకి తరలించారు. కానీ అతను అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
2019 నుంచే గుండె సంబంధిత వ్యాధితో సమీర్ బాధపడుతున్నట్లు తేలగా.. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ IIT కాన్పూర్ డైరెక్టర్ ప్రొ.ఎస్.గణేశ్ ట్వీట్ చేశారు. కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన సమీర్ ఖండేకర్.. ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చారు. ఆయనకు భార్య ప్రాధాన్యతోపాటు కుమారుడు ఉన్నారు. ఇలా ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు చెబుతూనే తమ మాస్టారు కుప్పకూలి మృతిచెందడంపై IIT కాన్పూర్ విద్యార్థులు భోరున విలపించారు.