మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 10 Jan 2024
ఆమె పేరు సరస్వతీదేవి.. వయసు 85 సంవత్సరాలు. రామ మందిర నిర్మాణం కోసం గత 30 ఏళ్లుగా ఆమె మౌనవ్రతాన్నే ఆశ్రయించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ కల నెరవేరడంతో ఇక ఝార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన ఈ వృద్ధురాలు.. తన మౌనదీక్షను వీడనున్నారు. జగదభిరాముడి భక్తురాలైన సరస్వతీదేవి.. 1992లో అయోధ్యను సందర్శించారు. అక్కడ రామ మందిరం కట్టే వరకు మౌనవ్రతం పాటిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నారు. అప్పట్నుంచి సైగలతో అనుకున్నది చెప్పడం, లేదంటే కాగితంపై రాసివ్వడం చేస్తున్నారు.
ఒంటి పూట భోజనమే…
మౌన మునీశ్వరిగా ముద్రపడ్డ సరస్వతీదేవి.. ప్రతిజ్ఞ చేసిన నాటి నుంచి ఒంటి పూట భోజనమే చేస్తున్నారు. రోజుకు ఒక గంట సేపు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. 2020లో ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయడంతో ఆ గంట కూడా మాట్లాడటం మానుకున్నారు. ఈ వృద్ధురాలు రెండ్రోజుల క్రితం అయోధ్యకు బయల్దేరి వెళ్లారు. ‘మౌని మాత’గా పేరుపొందిన ఈమె.. 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు ఘటన తర్వాత రామ మందిరం కోసం మౌనవ్రతం స్వీకరించారు. ధన్ బాద్ రైల్వేస్టేషన్ నుంచి గంగ-సట్లెజ్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆమె అయోధ్య చేరుకుని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక ఆహ్వానితురాలిగా…
లోక కళ్యాణం కోసం దీక్ష బూనిన సరస్వతీదేవిని.. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఆలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మహంత్ నృత్య గోపాల్ దాస్.. ఈ ఆహ్వాన లేఖను ఆమెకు అందజేశారు. ఎనిమిది మంది సంతానంలో నలుగురు కుమారులు, మరో నలుగురు కూతుళ్లున్న దేవి.. కట్టుకున్నవాడు 1986లో కాలం చేశాక పూర్తి ఆధ్యాత్మికురాలిగా మారిపోయారు. BCCL సంస్థలో పనిచేస్తున్న రెండో కుమారుడు నందలాల్ వద్ద ప్రస్తుతం సరస్వతీదేవి ఉంటున్నారు. జార్ఖండ్ BJP నేతలు ఆమెను.. ‘శబరి మాత’గా సంబోధిస్తుంటారు.