నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం సరికొత్త ప్లాన్ వేశారు. ఇప్పటివరకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన ఆమె… తమ తరఫు న్యాయవాదులతో రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారు. అసలు డిఫాల్ట్ బెయిలంటే ఏంటో చూద్దాం…
డిఫాల్ట్ బెయిలంటే…
ఏదైనా కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి చట్టంలో పలు నిబంధనలున్నాయి. నిర్దేశించిన టైంలో పూర్తి చేయకపోతే.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు బెయిల్ పొందొచ్చు. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి అధికారులు ఛార్జిషీట్ వేయాలి. ఒకవేళ ఛార్జిషీట్ వేయలేకపోతే కోర్టు అనుమతి తప్పనిసరి. కోర్టు పర్మిషన్ తీసుకోలేదని గుర్తించి వేసేదే డిఫాల్ట్ పిటిషన్.
ఒకేలా ఉండవు…
అన్ని కేసుల్లోనూ డిఫాల్ట్ రూల్స్ ఒకేలా ఉండవు. నేరాలు, కేసుల తీవ్రతను బట్టి ఉంటాయి. అరెస్టు చేసిన 24 గంటల్లో విచారణ పూర్తి కాదని భావిస్తే నిందితుల్ని కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరాలి. కోర్టు కస్టడీకి ఇవ్వకపోతే మాత్రం జ్యుడీషియల్ కస్టడీలో ఉండాల్సిందే. అలా కస్టడీలు కొనసాగుతూనే ఉంటాయి.
మరణశిక్ష, యావజ్జీవం లేదా పదేళ్లు విధించే కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులుంటుంది. మిగతా కేసుల్లోనైతే అది 60 రోజులే. ఈ గడువులోగా కేసు విచారణ పూర్తి కానట్లయితే బెయిల్ పొందే హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు.
ఛార్జిషీట్లో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని గతంలో CBI చెప్పింది. అయితే రీఫైలింగ్ లోనూ తప్పులున్నాయని కవిత లాయర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వచ్చే గురువారం లోపు కౌంటర్ వేయాలని CBIని న్యాయస్థానం ఆదేశించింది.