నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) రచ్చగా మారింది. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారా.. లేక నిజంగానే BJP నిర్ణయం తీసుకుందా.. అన్నది తేలాల్సి ఉంది. బీజేపీయేతర రాష్ట్రాలు, అదీ సౌత్ లోనే వ్యతిరేకత ఉంది. చివరి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. చట్ట ప్రకారం తదుపరి డీలిమిటేషన్ 2021లో జరగాలి. కానీ కొవిడ్ తో జనాభా లెక్కలు జరగక పునర్విభజన ఆగిపోయింది. 2025 లేదా 2026లో కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. జనాభా లెక్కలు పూర్తయితే రాబోయే సాధారణ ఎన్నికల(2029) నాటికి పార్లమెంటు సెగ్మెంట్లలో భారీ మార్పులుంటాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కీలకమే.
శాసనసభలు, పార్లమెంటులో మూడింట ఒక వంతును మహిళలకు ఇవ్వాలి. ఇవన్నీ డీలిమిటేషన్ కు ముడిపడి ఉన్నాయి. దేశం మొత్తం యూనిట్ గా, ప్రతి రాష్ట్ర జనాభా ఆధారంగా MP సీట్లు కేటాయించాలి. ఒక రాష్ట్ర MP స్థానాలు జాతీయ రాజకీయాల్ని శాసించనుండగా, ఆ సీట్లను కీలకంగా భావిస్తున్నాయి రాష్ట్రాలు. 1976 వరకు డీలిమిటేషన్ జనాభా ఆధారంగానే తయారైంది. 2026 వరకు దీన్ని పూర్తిచేయాల్సిందేనని 84వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. MP సీట్లను పెంచుతారా లేదా.. లేక అలాగే ఉంచి జనాభా లెక్కల్ని మాత్రమే పూర్తి చేస్తారా.. అన్నది సంశయంగా మారింది.
ఉత్తరప్రదేశ్ లో 80 మంది, తెలుగు రాష్ట్రాల్లో 42 మంది MP సీట్లున్నాయి. జనాభా లెక్కన సీట్లు పెంచితే UPలో 96 మంది, తెలుగు రాష్ట్రాల్లో 50 మంది అవుతారు. ప్రస్తుతం UP-తెలుగు రాష్ట్రాల అంతరం 38 సీట్లయితే, డీలిమిటేషన్ వల్ల అది 46కు పెరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల మాట. దీనిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చినా బీజేపీయేతర పక్షాలు నమ్మడం లేదు.