ఉల్లి(Onion) ధరల లొల్లి మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పంట(Crop) తగ్గిపోవడమే సరఫరా(Supply) లేకపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 నుంచి రూ.50 దాకా పలుకుతున్నది. నెల క్రితం ఇది రూ.20 నుంచి రూ.25 ఉండేది.
రెండు వారాల్లోనే…
వివిధ రాష్ట్రాల్లో గత రెండు వారాల్లోనే ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఈ పంటను అత్యధికంగా పండించే మహారాష్ట్రలో ఈసారి కరవు ఏర్పడి ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలోని మొత్తం పంటలో 42% మరాఠా వాసులు పండిస్తుండగా… ఈసారి ఉత్పత్తి 15 నుంచి 20% తగ్గింది. అక్కడ 27 జిల్లాల్లో 20 నుంచి 45% వరకు లోటు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
రాజధానిలో…
హైదరాబాద్ లో ప్రస్తుతం రూ.100కు రెండున్నర కిలోలు అంటే కిలో రూ.40కి అమ్ముతున్నారు. రిటైల్ ధర 25%, హోల్ సేల్ రేట్ 15% మేర పెరిగింది. సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో రూ.50 నుంచి 60 దాకా అయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం నడుస్తున్నది. ఈనెల 17న బక్రీద్ ఉండటంతో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి ధరలు మరింత పెరిగేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి.