Published 27 Dec 2023
విపరీతంగా కురుస్తున్న పొగ మంచుతో తెల్లారి 11 గంటల దాకా దారి కనపడని(Visibility) ప్రమాదకర పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పడింది. పాలంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(IGIA) వద్ద వాతావరణం మరీ క్షీణించడంతో భారీ యెత్తున విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా దేశీయంతోపాటు విదేశాల నుంచి రావాల్సిన 110 ఫ్లైట్ ల సమయాల్ని పొడిగించారు. హస్తినలో విజిబిలిటీ 50 నుంచి 200 మీటర్ల మధ్యలో ఉండటంతో వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అటు విపరీతమైన కాలుష్యం(Pollution) సైతం మేఘాల్ని కప్పివేసింది. పొల్యూషన్ వల్ల AQI(Air Quality Index) పడిపోవడంతో శ్వాస తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించిన వాతావరణ శాఖ గురువారం నాడు ‘ఎల్లో అలర్ట్’ ఉంటుందని తెలిపింది.
ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలు కాగా.. అత్యల్ప ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మరికొన్ని రోజుల పాటూ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర రాజస్థాన్ తోపాటు తూర్పు, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోనూ ఇదే తరహా మంచు ప్రభావం పొంచి ఉంది. సోమవారం నాడు 383గా AQI మంగళవారం నాటికి 377కు చేరుకుని ‘వెరీ పూర్’ దశను నమోదు చేసింది. ఇది గురు, శుక్రవారానికల్లా మరింతగా పెరిగి డేంజరస్ స్థాయికి చేరుకోనుంది.