ప్రపంచ దేశాలు భారత గడ్డపై అడుగుపెడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశాల అధినేతలు భారత్ లో కాలు మోపేందుకు పంపే ఆహ్వన పత్రికల్లో ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో సర్కారు ప్రింట్ వేయించింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాగా పిలుస్తున్న మన దేశాన్ని ఇంగ్లీషులో కూడా ఇక నుంచి భారత్ గా పిలిచేలా కేంద్రం మార్పులు చేస్తున్నదన్న ప్రచారం దేశంలో తీవ్ర చర్చకు కారణమైంది. దీనిపై విపక్షాలు మండిపడుతుండగా.. BJP మాత్రం స్వాగతించింది. ఈనెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ-20 సమావేశాలకు వచ్చే దేశాధినేతల(Presidents, Prime Ministers)కు రాష్ట్రపతి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఈ ఆతిథ్యానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డుల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా అభివర్ణించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లోనే ఈ పేరును పర్మినెంట్ చేస్తారా అన్న సందేహాలు అంతటా కనిపిస్తున్నాయి. మోదీ సర్కారు దీనిపై ప్రత్యేక తీర్మానం చేసే అవకాశం ఉన్నందునే ఇప్పటివరకు పార్లమెంటు సెషన్స్ కు సంబంధించిన షెడ్యూల్(Schedule)ను డిక్లేర్ చేయలేదన్న మాటలు వినపడుతున్నాయి.
దేశం పేరు మార్చేందుకు BJP ప్రభుత్వం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందని, తమ కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే భారత్ గా మార్పు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ నిర్ణయంపై దీటుగా స్పందించారు. మేం ఇండియా పేరు పెట్టుకుంటే భారత్ గా మారుస్తున్నారు.. రేపు మా కూటమికి భారత్ అని పెట్టుకుంటే అప్పుడు ఈ భారత్ పేరు కూడా మారుస్తారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.